జగన్ హెలికాప్టర్ ప్రయాణాలపై పవన్ సెటైరికల్ పోస్టు!

Sun Jul 03 2022 19:51:25 GMT+0530 (IST)

Pawan satirical post on Jagan helicopter trips

జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయంగా జోరు పెంచేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓవైపు పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టిన పవన్.. మరోవైపు జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో ఏపీలోని జిల్లాలను చుట్టేస్తున్నారు. తాజాగా జూలై 3 నుంచి జనవాణి పేరుతోనూ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రజలు తమ సమస్యలపై అర్జీలను నేరుగా జనసేనాని పవన్ కల్యాణ్ కే అందించనున్నారు.ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్.. జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ నేతల నుంచి కూడా పవన్ కు భారీగా కౌంటర్లు పడుతున్నాయి. కాగా జూలై 3న పవన్ కల్యాణ్ తన సోషల్ మీడియాలో పెట్టిన ఒక సెటైరికల్ పోస్టు అందరి దృష్టిని ఆకర్షించింది.

జగన్ ను ఎద్దేవా చేస్తూ సెటైరికల్ కార్టూన్ పోస్ట్ చేశారు. డీజిల్ సెస్ పేరుతో జగన్ ప్రభుత్వం తాజాగా ఆర్టీసీ చార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్.. జగన్ ను వెటకారం చేస్తూ ఒక కార్టూన్ ను పోస్టు చేశారు. ఆ కార్టూనులో హెలికాప్టర్‌లో వెళ్తున్న జగన్‌ను బస్టాండ్‌లో ఓ నిరుపేద కుటుంబం చూస్తూ ఉంటుంది . ‘విజయవాడ-మంగళగిరి మధ్య వెళ్లేందుకు కూడా సార్ (జగన్) హెలికాప్టర్‌ను మాత్రమే వాడుతున్నారు. మాకు మాత్రం బస్సులో ప్రయాణించే స్థోమత కూడా లేదు” అని వారు చెప్పడం కనిపిస్తుంది. ఆ కార్టూన్ లో ఉన్న బస్టాప్‌కు పైకప్పు కూడా లేదు.

పవన్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన క్షణాల్లోనే ఈ కార్టూన్ వైరల్ గా మారింది. పవన్ కల్యాణ్ అభిమానులు జనసేన పార్టీ శ్రేణులు ఈ సెటైరికల్ కార్టూన్ ను లైకులు షేర్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. జగన్ పై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేస్తూ పవన్ పోస్టు చేసిన ఈ కార్టూన్ వైరల్ అవుతోంది. కాగా డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ చార్జీలను పెంచడంతో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులపై చార్జీల బండ భారీగా పడుతోందని తెలుస్తోంది.