మనల్ని తిడుతున్నారంటే.. మనం గ్రేట్ : పవన్

Tue Jan 21 2020 18:27:28 GMT+0530 (IST)

Pawan kayan Interact with Amaravati Farmers

జనసేన నేతలను వైసీపీ నాయకులు తిడుతున్నారు అంటే మనం చాలా బలమైన స్థాయిలో ఉన్నామని అర్ధమని ఆ పార్టీ నేతలతో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. వాళ్లకి మన సమూహం అంటే భయం. అంతటి బలమైన సమూహం మనకి ఉందని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయంలో కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుల చేతిలో దాడికి గురైన జనసేన నాయకులు - కార్యకర్తలతో పవన్ కళ్యాణ్  ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోదావరి జిల్లాల్లో మాటలతో అయ్యే రాజకీయాలను వైసీపీ నాయకులు కత్తులు - కటార్ల వరకు తీసుకువచ్చారని జనసేన అధ్యక్షుడు మండిపడ్డారు.గోదావరి జిల్లాల్లో సీమ తరహా రాజకీయ ఉండదనీ పెద్దరికం మాత్రమే ఉంటుందని పవన్ కళ్యాణ్ విశ్లేషించారు. ఫ్యాక్షన్ సంస్కృతిని బలంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. “రాయలసీమలో ప్రతి ముద్దకీ పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ అలాంటి పరిస్థితులు ఉండవు. గోదావరి జిల్లాలకు కూడా అలాంటి సంస్కృతిని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో పోలీసుల పాత్ర ఏమీ ఉండదు. వాళ్లు దౌర్జన్యానికి పాల్పడి పోలీసుల మీద ఒత్తిడి తేస్తే వారు మాత్రం ఏం చేయగలరు? పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు అంటే అది వారి వ్యక్తిగతం కాదు. ఒత్తిడికి లోబడి పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ తరహా క్రిమినల్ రాజకీయాలను పారద్రోలాలన్నదే నా లక్ష్యం. `` అని ప్రకటించారు.

దాడులు జరిగినప్పుడు భయపడకూడదని పవన్ హితబోధ చేశారు. ``ఒక భావజాలంతో ఇంకో భావజాలాన్ని కొట్టాలి. భావజాలంతో సమస్యను అధిగమించినప్పుడే హింస తగ్గుతుంది. అనేక క్రిమినల్ కేసులు ఉన్న వారే అంత మొండిగా వ్యవహరిస్తుంటే మనం ఇంకెంత మొండిగా ఉండాలి. కొత్త నాయకులను ఓ సరికొత్త రాజకీయ  వ్యవస్థను తయారు చేయాలన్నదే నా జీవితాశయం. సమాజానికి బలంగా నిలబడగలిగే నాయకత్వాన్ని తీసుకువచ్చినప్పుడే మార్పు సాధ్యమవుతుంది. అప్పుడే రెండు మూడు తరాలు బాగుపడతాయి. మనం ఒక రోల్ మోడల్ కావాలి. ఒక మాట మాట్లాడితే అది లక్ష మంది మెదళ్లలో ఆలోచన రేపాలి. పది లక్షల మంది వెన్నెముకల్లో కదలిక తేవాలి. బలంగా నిలబడిన వారే నాయకులు అవుతారు. భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ఇద్దరు ఎం.పి.లతో ప్రారంభమయ్యింది. ఎమర్జెన్సీ సమయంలో అసలు పార్టీనే లేకుండా చేద్దాం అనుకున్నారు. పోరాటంతో ఈనాడు ఇంత బలంగా నిలబడింది.`` అని తెలిపారు.