బీజేపీతో పొత్తు ఎందుకు..వాళ్లకు వివరించనున్న పవన్

Fri Jan 17 2020 23:00:01 GMT+0530 (IST)

Pawan kalyan on About His Alliance with BJP

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్....తన రాజకీయ ప్రయాణం గురించి కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీతో కొనసాగిన ఆయన తాజాగా కాషాయ పార్టీకి దగ్గరయ్యారు. ఏకంగా పొత్తు పెట్టుకున్నారు. అయితే ఈ పరిణామంపై పార్టీ నేతల్లోనే కొన్ని సందేహాలు - ఎన్నో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.బీజేపీతో పొత్తు - రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో క్రియాశీలక కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయవలసిందిగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ నేతలను ఆదేశించారు. బీజేపీతో రాజకీయ ప్రయాణం - స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై కార్యకర్తల సమావేశాల్లో చర్చిస్తారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు - ముఖ్యనేతలతో సమావేశం సందర్భంగా కార్యకర్తల భేటీ వివరాలను పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గంటన్నరపాటు సాగిన ఈ సమావేశంలో రానున్న నాలుగు వారాలకు సంబంధించి పార్టీ కార్యక్రమాల ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే వారితో పాటు తమ తమ వృత్తులు - ఉద్యోగాలు కొనసాగిస్తూ పార్టీ కోసం కష్టపడే వారి జాబితాలు తయారు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ నెల చివరి వారం నుంచి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ జెండాను మోస్తున్న కార్యకర్తలందరినీ గుర్తించి వారిని ఆదరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. జాతీయ - ప్రాంతీయ ప్రాధాన్యత ఉన్న అంశాలు ప్రభుత్వ విధానాలు - పార్టీ ఆలోచనా విధానం - వర్తమాన రాజకీయ అంశాలపై ఎంపిక చేసిన కార్యకర్తలకు వర్క్ షాప్స్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని  చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాలను రూపొందించాలని పవన్ పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన యువ అభ్యర్ధుల సమావేశాలను కూడా ఏర్పాటు చేయవలసిందిగా చెప్పారు. పార్టీలో ఉంటూ సామాజిక సేవ చేయాలన్న తలంపు ఉన్నవారితో సేవాదళ్ ను పటిష్టంగా రూపొందించాలని సూచించారు. కాగా పవన్ నిర్వహించే ఈ సమావేశం గురించి సహజంగానే ఆసక్తి నెలకొంది.