ఇంతకీ పవన్ కల్యాణ్ కు ఆ భాగ్యం ఎప్పుడు కలుగుతుంది?

Sat Jan 18 2020 12:17:12 GMT+0530 (IST)

Pawan kalyan Unable to Get Modi and Amit Shah Appointment

జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ఈ మధ్యకాలంలోనే రెండు సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారు. రెండు సార్లూ భారతీయ జనతా పార్టీ వాళ్లతోనే పవన్ సమావేశం అయ్యారు. మొదటి సారి వెళ్లినప్పుడు కొన్ని రహస్య సమావేశాలు రెండో సారి  వెళ్లినప్పుడు నడ్డాను కలిసి పొత్తు ప్రతిపాదన చెప్పడాలు జరిగాయి. అయితే రెండు సార్లూ పవన్ వెళ్లింది మాత్రం వేరే అజెండాతో.ప్రధానమంత్రి నరేంద్రమోడీ - కేంద్ర హోం మంత్రి అమిత్ షాల దర్శనార్థం పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారనేది బహిరంగ రహస్యం. భారతీయ జనతా పార్టీ లో ఇప్పుడు అంతా వాళ్లిద్దరి కనుసన్నల్లోనే సాగుతుంది. ఏ వ్యవహారం విషయంలో అయినా వారు చెబితే ఏదైనా జరుగుతుంది. దేశంలోనే ఇప్పుడు అత్యంత పవర్ ఫుల్ నేతలు వాళ్లిద్దరూ. ఇలాంటి క్రమంలో బీజేపీతో చేతులు కలపడానికి ఉత్సాహపడిన పవన్ కల్యాణ్ కూడా వారితో కలవాలని అనుకుని ఉండవచ్చు. అయితే రెండు సార్లు వెళ్లినా పవన్ కు వారి దర్శనం మాత్రం దక్కలేదు.

చివరకు ఎలాగో బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలను కలిసి పొత్తు ప్రకటన చేశారు. ఇక నుంచి అన్ని ఎన్నికల్లోనూ రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. ఇలా లాంఛనంగా ఫ్రెండ్స్ అయ్యారు.

అయితే ఇంతకీ బీజేపీ వన్ అండ్ టూ లతో పవన్ ఎప్పుడు సమావేశం అవుతారు? అనేది ఆసక్తిదాయకమైన అంశం.  వారితో సమావేశం కాగలిగినప్పుడే పవన్ కల్యాణ్ కు బీజేపీ తరఫు నుంచి ఎంతో కొంత గుర్తింపు లభించినట్టు. అలా కాకుండా... ఎన్ని కబుర్లు చెప్పినా పవన్ ను బీజేపీ అంతగా గుర్తించనట్టే. ఇవతల పవన్ ఫ్యాన్సేమో ఆయనకు రాజ్యసభ సీటు దక్కుతుందని కేంద్రమంత్రి పదవి ఖరారు అయ్యిందని ప్రచారం చేస్తున్నారు. ముందు మోడీ - షాల అపాయింట్ మెంట్ పవన్ కు దక్కితే ఆ తర్వాత ఇలాంటి ఊహాగానాలను లీకిచ్చినా వాటితో అంతో ఇంతో విలువ ఉంటుందేమో!