పవన్ అడిగిన ఉచితాన్ని ఓకే చేయొచ్చుగా కేసీఆర్?

Wed Apr 24 2019 18:00:02 GMT+0530 (IST)

Pawan kalyan Reacts on Inter Students Suicide in Telangana State

ఊహించని పిడుగులా పడిన ఇంటర్ పరీక్షల వ్యవహారం అంతకంతకూ పెరుగుతోంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పట్టించుకోనట్లుగా వ్యవహరించటం.. అట్టే ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండటం.. అసలు అదో విషయం హాట్ టాపిక్ గా మారిందన్న భావనకు రానట్లుగా ఉండటం లాంటివి కేసీఆర్ సర్కారులో తరచూ చోటు చేసుకునేవే. అయితే.. లక్షలాది మంది విద్యార్థుల భవితను దెబ్బ తీసే ఇంటర్ మార్క్ షీట్ల గందరగోళంపై తెలంగాణ విపక్షాలతో పాటు.. విద్యార్థి సంఘాలు నిరసనలు నిర్వహించటం.. ఆందోళనలు చేపట్టటం తెలిసిందే. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటివరకూ స్పందించింది లేదు.తూతూ మంత్రంగా కమిటీ వేయటం.. తాజాగా ఈ ఎపిసోడ్ పై సీరియస్ కావటం మినహా పెద్ద నిర్ణయాలు ఏమీ తీసుకోలేదు.ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు.. వాల్యూయేషన్ విషయంలో చోటు చేసుకున్న పొరపాట్ల మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రియాక్ట్ కావటం.. ట్విట్టర్ లో వరుస ట్వీట్లు చేశారు. తాజాగా ఇదే అంశం మీద జనసేన అధినేత పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరమని ఆయన పేర్కొన్నారు.

ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తున్న వేళ. పవన్ రియాక్ట్ అవుతూ.. ఈ అంశంపై ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. పరీక్ష ఫీజు చెల్లింపు.. వాల్యూవేషన్ నుంచి ఫలితాల్ని వెల్లడించటం వరకూ చాలా సందేహాలు ఉన్నాయని.. వాటిని తీర్చాలన్నారు. రీవాల్యూయేషన్ ను ఉచితంగా చేపట్టాలని... దీనిపై తెలంగాన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయాలన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేసి.. తగిన పరిహారం ఇప్పించాలన్నారు. ఇంత గందరగోళానికి కారణమైన ఐటీ కంపెనీ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి.. పవన్ కోరినట్లుగా కేసీఆర్ ఉచితం మీద కీలక ప్రకటన చేస్తారంటారా?