ఏపీ అయిపోయింది!... తెలంగాణపై పీకే గురి!

Mon Apr 22 2019 19:31:22 GMT+0530 (IST)

Pawan kalyan Concentrates on About Telangana Politics

ఏపీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో శక్తిమేర తిరిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... పోలింగ్ ముగిసిన వెంటనే ఓ పది రోజుల పాటు ఫుల్ రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత బయటకు వచ్చిన పవన్.... ఏపీలో జరిగిన పోలింగ్ సరళి - పోలింగ్ లో జనసేనకు మద్దతుగా వచ్చిన ఓటర్లు - పార్టీ గెలిచే స్థానాలు ఏవి? అసలు ఈ ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగిన నేపథ్యంలో కనిపించిన మార్పు తదితరాలపై ఆయన సుదీర్ఘ సమీక్షలే నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఎలాగూ ఏపీలో ఎన్నికలు ముగిసిపోయాయి కాబట్టి... ఇక తెలంగాణపై దృష్టి సారిద్దామన్న భావనలో పవన్ ఉన్నట్లుగా ఆయన మాటలే చెబుతున్నాయి. ఏపీలో ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టే జనసేనకు మంచి ఆదరణ లభించిందని చెబుతున్న పవన్... ఇక తెలంగాణ సమాజం కూడా మార్పు కోరుతోందని సంచలన వ్యాఖ్య చేశారు.అంటే... ఇకపై తెలంగాణలోనూ జనసేనను యాక్టివేట్ చేయనున్నట్లుగా ఆయన పరోక్షంగా చెప్పినట్టైందన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేద్దామంటూ ఆ పార్టీ తెలంగాణ బాధ్యులు ఇటీవలే పవన్ తో భేటీ అయి చర్చించారు. ఈ మాటపై అప్పటికప్పుడే తన నిర్ణయాన్ని వెల్లడించని పవన్... ముందుగా ప్రజలు - పార్టీ కార్యకర్తలు - మేథావులతో చర్చించి తనకు ఓ నివేదిక ఇవ్వాలని - ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ ఎన్నికల సరళిపై విశ్లేసణ కోసమంటూ విజయవాడలో ఏర్పాటు చేసిన సమీక్ష సందర్భంగా పవన్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ఏపీ ప్రజల మాదిరే తెలంగాణ ప్రజలు కూడా మార్పును కోరుకుంటున్నారని - ఈ పరిణామంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని పవన్ వ్యాఖ్యానించారు.

ఈ తరహా వ్యాఖ్యలతో తెలంగాణలోనూ పార్టీని యాక్టివేట్ చేసే దిశగానే పవన్ సాగుతున్నారన్న విశ్లేషణలు మొదలయ్యాయి. చూస్తుంటే.. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనే జనసేన పూర్తి స్థాయిలో బరిలోకి దిగే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణలో కేసీఆర్ పాలనను గతంలో ఆకాశానికెత్తేసిన పవన్... తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించడం ద్వారా కేసీఆర్ పాలన గాడి తప్పిందని భావిస్తున్నారా అన్న విశ్లేషణలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. అయితే తన మనసులోని మాటను నేరుగా బయటపెట్టకుండా... ఇలా డొంకతిరుగుడుగా - కొంచెం విప్పి - కొంచెం కప్పి అన్న రీతిలో పవన్ చేసిన వ్యాఖ్యలు... జనాల్లో పెద్ద చర్చనే రేకెత్తించాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.