Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో ఆంధ్రుల‌కు సీఏఏకు లింకుపెట్టిన ప‌వ‌న్

By:  Tupaki Desk   |   27 Jan 2020 3:30 PM GMT
తెలంగాణ‌లో ఆంధ్రుల‌కు సీఏఏకు లింకుపెట్టిన ప‌వ‌న్
X
దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేకెత్తిస్తున్న సీఏఏపై జ‌నసేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్ఆర్సీ భారత దేశంలోని ప్రతి పౌరుడికి వర్తిస్తుందనీ, కేవలం ముస్లింల కోసం మాత్రమే పెట్టింది కాదని తెలిపారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ప‌వ‌న్ పశ్చిమ నియోజకవర్గంలోని సమస్యలతో పాటు రాష్ట్రంలో - దేశంలో నెలకొన్న పరిస్థితులపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వివిధ అంశాల‌పై స్పందించారు.

సీఏఏ - ఎన్ ఆర్సీ వల్ల పౌరసత్వం తీసేస్తారన్న భయాలు ఎవరికీ అవసరం లేదని ప‌వ‌న్ తెలిపారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే మత ప్రాతిపదికన ప్రజల్ని రెచ్చగొట్టి గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. “భారత రాజ్యాంగం గొప్పది. మత ప్రాతిపదికన ప్రజల్ని విడదీయదు. మతం పేరుతో మనుషుల్ని విడదీయడం సాధ్యం కాదు. తాత - తండ్రి వివరాలు అందుబాటులో లేకపోతే మీరు భారత పౌరులు కారు అనుకోవద్దు. అది సాధ్యపడదు కూడా. ప్రభుత్వాలు మారినప్పుడు తమ విధానానికి అనుగుణంగా వివరాలు సేకరిస్తాయి. తెలంగాణలో సకల జనుల సర్వే అని పెట్టినప్పుడు కూడా ఆంధ్రవారిని సపరేట్ చేయడానికని అపోహలు రేపారు. అలాంటివి చేయడం అసాధ్యం. ఆధార్ కోసం వివరాలు కోరినప్పుడు కూడా చాలామందిలో సందేహాలు వచ్చాయి... ఓ ప్రయివేట్ కంపెనీకి ఇస్తే ఏం జరుగుతుందోనన్న అనుమానం వచ్చింది. `` అని ప‌వ‌న్ పేర్కొన్నారు.

సీఏఏ తీసుకు వచ్చింది బంగ్లాదేశ్ లాంటి సరిహద్దు దేశాల నుంచి వచ్చే హిందువులు-ముస్లింల కోసమ‌ని ప‌వ‌న్ తెలిపారు. ``ఇది కేవలం ఒక్క ముస్లింల కోసమే అన్నది అబద్దం. అసోంలో వలసల కారణంగా వారి ఉద్యోగాలు పోతున్నాయి, భూముల ధరలు పెరిగిపోతున్నాయన్న భయంతోనే గొడవ. నేను దేశాన్ని ప్రేమిస్తా. మతానికి అతీతంగా మాట్లాడుతా. ఎవరో చెప్పింది విని చట్టం గురించి తెలుసుకోకుండా భయాలు పెట్టుకోవద్దు. ముందుగా జనసేన పార్టీలో ఉన్న ముస్లిం సోదరులంతా కలసి కూర్చుందాం. ఎవరికి ఎలాంటి భయాలు ఉన్నాయో నివృత్తి చేసుకుందాం. నా వరకు స్వతహాగా దేశ సమగ్రతను కోరుకుంటా. దేశ భక్తిని మత ప్రాతిపదికన కొలవలేం. దేశం విడిపోయినప్పుడు పాకిస్థాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ గా విడిపోతే - భారత దేశాన్ని మాత్రం హిందూ రిపబ్లిక్ గా చేసే అవకాశం ఉన్నా చేయలేదు. వాస్తవానికి హిందూత్వం అనేది ఒక జీవన విధానం... మతం కాదు. అందులో దేవుని చూసేందుకు ఎన్నో దారులు ఉన్నాయి. పాకిస్థాన్ విషయానికి వస్తే తూర్పు-పశ్చిమ భాగాల్లోనే ఆచార వ్యవహారాల్లో తేడాలు ఉన్నాయి. ఇరు వర్గాల మధ్య హింస ప్రజ్వరిల్లడం బంగ్లాదేశ్ ఏర్పాటుకు దారి తీసింది. అంతర్జాతీయ సరిహద్దులు ఉన్న దేశాల నుంచి మన దేశానికి వచ్చే మైనారిటీల కోసమే సీఏఏ తీసుకువచ్చారు. ఎన్ ఆర్సీ మాత్రం ప్రతి పౌరుడికీ వర్తిస్తుంది. ఈ అంశానికి సంబంధించి ముస్లిం సోదరుల్లో ఉన్న భయాలు - అపోహలు తొలగించేందుకు ప్రత్యేకంగా ఓ సమావేశం ఏర్పాటు చేస్తాం` అని ప‌వ‌న్ తెలిపారు.