Begin typing your search above and press return to search.

అప్పుడెప్పుడో పవన్ బీజేపీని ఏమేం అన్నారంటే?

By:  Tupaki Desk   |   17 Jan 2020 2:30 PM GMT
అప్పుడెప్పుడో పవన్ బీజేపీని ఏమేం అన్నారంటే?
X
నిజం మాత్రమే చెప్పటం ఎంత కష్టమో.. మాట మీద నిలబడటం కూడా అంతే కష్టం. అందులోనూ రాజకీయాల్లో ఉన్న వేళ.. అన్న మాటల్ని.. ఇచ్చిన హామీల్ని గుర్తుంచుకోవటానికి మించిన తలనొప్పి మరొకటి ఉండదు. పాత రోజులైతే ఫర్లేదు. పేపర్లు మాత్రమే ఉండేవి. కొద్ది రోజులైతే ఎవరు ఎప్పుడు..? ఎక్కడ? ఏమన్నారన్న విషయాన్ని గుర్తు పెట్టుకునేటోళ్లు చాలా తక్కువగా ఉండేవారు. దీంతో.. మర్చిపోవటం ఈజీ.

ఇప్పుడేమో దరిద్రపుగొట్టు గూగులమ్మ ఉండనే ఉంది. ఆ గూగులమ్మ సోదరుడు యూట్యూబ్ మహా దుర్మార్గుడు. వాడి మెమరీ చాలా అంటే చాలా ఎక్కువ. అంతం లేనట్లుగా ఉండే వాడి మెమరీతో.. జస్ట్ అలా దేని గురించి టైప్ చేసినా.. దానికి సంబంధించి బోలెడన్ని వీడియోల్ని చూపించేస్తుంటాడు. దీంతో.. ఎవరు? ఎప్పడేం అన్నది నిమిషాల్లో ప్రత్యక్షం కావటమే కాదు.. సోషల్ మీడియాలో వైరల్ చేసి పారేయటం ఈ మధ్యన మా చెడ్డగా తయారైంది. ఇలాంటివన్నీ జనసేన అధినేత పవన్ లాంటోళ్లకు మహా ఇబ్బందనే చెప్పాలి.

గత ఏడాది అక్టోబరులో పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ.. చస్తే చస్తాం కానీ.. జనసేన పార్టీని ఎప్పటికి బీజేపీలో విలీనం చేయను. మనం కలుపుతామా? భారతీయ జనతాపార్టీలో జనసేన పార్టీని. చస్తే.. చస్తాం. ఉంటే ఉంటాం. పోతే పోతాం. కానీ తెలుగుజాతి ఉన్నతిని.. గౌరవాన్ని ఎప్పటికి కాపాడుతూనే ఉంటానని మహా ఉద్వేగంగా మాట్లాడారు. తీరా చూస్తే.. ఇప్పుడు పార్టీని విలీనం చేయలేదు కానీ.. పొత్తు పెట్టేసుకున్నారు. ఇవాల్టి పొత్తే.. రేపటి విలీనమని కొందరి నోటి నుంచి వస్తున్నమాటలకు జనసైనికులు తిడుతున్నారు కానీ.. వారి అంతర్మాత సైతం పలు సందేహాల్ని వ్యక్తం చేస్తున్నట్లుగా అభిఘ్న వర్గాల బోగట్టా.

హోదా ఎపిసోడ్ టైంలో బీజేపీని పట్టుకొని ఎన్నెన్ని మాటలు అన్నారో పవన్ కల్యాణ్. ఇప్పుడేమో అందుకు భిన్నంగా.. పొత్తు పెట్టేసుకొని చెట్టా పట్టాలేసుకున్న వేళ.. పాత మాటలన్ని కళ్ల ముందు రీళ్ల మాదిరి తిరుగుతున్న వేళ.. పవన్ మాటల మీద కొత్త సందేహాలు మొదలవుతున్న పరిస్థితి.

గతంలో బీజేపీని ఉద్దేశించి పవన్ మాష్టారి నోటి నుంచి వచ్చిన అద్భుతమైన వాక్కులు కొన్ని చూస్తే..

04 మార్చి 2018 హైదరాబాద్ లో..

‘‘పాచిపోయిన లడ్డూ లాంటి ప్రత్యేక ప్యాకేజీ కూడా మోదీ సర్కారు రాష్ట్రానికి సరిగా ఇవ్వలేదు. ఉడుముకు ముఖంపై రాసిన తేనెలా రాష్ట్రం పరిస్థితి తయారైంది. కేంద్ర ప్రభుత్వం సృష్టించిన అయోమయ పరిస్థితి వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారు’’

13 అక్టోబరు 2018 విజయవాడలో..

‘‘వెనుకేసుకురావడానికి నాకు బీజేపీ బంధువూ కాదు. మోదీ అన్నయ్యా కాదు. అమిత్‌ షా బాబయ్యా కాదు. వారిని ఎందుకు వెనుకేసుకొస్తాను? రాజకీయ జవాబుదారీతనం లేనందునే ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన ప్రత్యేక హోదా దక్కలేదు’’

02 మార్చి 2019 చిత్తూరులో..

‘‘నా దేశభక్తిని శంకిస్తున్న బీజేపీ నేతలు హద్దుల్లో ఉండాలి. అవాకులు - చెవాకులు పేలితే సహించే ప్రశ్నే లేదు. నేను మొదలు పెడితే బీజేపీ నేతలు నోరు తెరవలేరు’’

14 మార్చి 2019 రాజమహేంద్రవరంలో..

‘‘ప్రధానమంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయకుండా మోసం చేశారు. సీఎం చంద్రబాబు మీద కోపం ఉంటే ఆయన మీద చూపించండి. మా రాష్ట్రం మీద ఎందుకు చూపిస్తారు?’’

03 ఏప్రిల్ 2019 విశాఖపట్నంలో..

‘‘రూ.10 లక్షల సూట్‌ వేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ వృథా చేసేంది ప్రజాధనమే. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీని అడగాల్సి ఉంది’’