జగన్ మీద చెడా మడా...పవన్ ఆవేశం ఎందుకంటే...?

Mon Aug 15 2022 16:00:01 GMT+0530 (IST)

Pawan's anger because...?

ఏపీని పాలిస్తున్న జగన్ని  పవన్ ఎపుడూ గురి పెడుతూనే ఉంటారు. వైసీపీ మీద ఆయన విమర్శలు కూడా చాలా హార్ష్ గా ఉంటాయి.  అసలు ఎవరూ కూడా తట్టుకోలేరు అన్నట్లుగానే ఆయన కామెంట్స్ చేస్తూ ఉంటారు. లేటెస్ట్ గా మంగళగిరిలో పార్టీ మీటింగులో కూడా పవన్ మరోసారి జగన్ సర్కార్ మీద విరుచుకుపడ్డారు.  పాలకుల మీద చెడా మడా అనాల్సినవి అన్నీ అనేశారు.అసలు అమలు కానీ హామీలు ఎవరు ఇవ్వమన్నారు జనాలను ఎవరు మభ్యపెట్టమన్నారు అంటూ జగన్ని సూటిగా ప్రశ్నించారు. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఎన్నికల ముందు ఇచ్చి ఆనక వాటిని పూర్తి చేయలేక చేతులెత్తేయడం వైసీపీ నేతలకు అలవాటుగా మారింది అని జగన్ని నిందించారు. ఇక ఏపీని అప్పుల కుప్ప చేసిన ఘనత కూదా జగన్ సర్కార్ దే అని ఆయన మండిపడ్డారు.

ఏపీలో హామీల అమలు పేరిట విచ్చలవిడిగా అప్పులు చేశారని అలాగే వ్యవస్థల మీద దాడి జరుగుతోందని ఆయన ఫైర్ అయ్యారు. ఇన్నేసి అప్పులు ఏ మాత్రం బాధ్యత లేకుండా చేయడం సబబేనా అని జగన్ని ప్రశ్నించారు. తాము సంక్షేమానికి వ్యతిరేకం కాదని పవన్ చెబుతూనే అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించడాన్ని మాత్రం సహించే ప్రసక్తి లేదని చెప్పారు.

ఏపీలో పాలన అసలు ఎక్కడ ఉందని కూడా పవన్ నిలదీయడం విశేషం. ఏవో అరకొర పధకాలు  జనాలకు ఇచ్చామనిపించుకుంటే పని పూర్తి అయినట్లేనా అని ఆయన నిగ్గదీస్తున్నారు. ఏపీలో అసలు ఏ కోశానా అయినా అభివృద్ధి ఉందా అని పవన్ హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్ కి కూడా కౌంటర్లు పడుతున్నాయి. దాదాపుగా 650 పై చిలుకు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని సవ్యంగా అమలు చేయని చంద్రబాబుని నాడు పవన్ ఎందుకు నిలదీయలేదు అని కూడా ప్రశ్నలు ఆయనకే వస్తున్నాయి.

అలాగే నాడు చంద్రబాబు కూడా అప్పులు చేసి ఏపీని రుణాంధ్రప్రదెశ్ గా మార్చారని మరి నాడు బాబుని నిలదీయడానికి పవన్ గొంతు ఎందుకు మూగబోయింది అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మొత్తానికి పవన్ బాధ అంతా రాష్ట్రం మీద బాధ లేక జగన్ సీఎం గా ఉన్నాడన్న బాధా అన్న విమర్శలు కూడా వచ్చిపడుతున్నాయి.

ఇదిలా ఉంటే పవన్ తన ప్రసంగంలో ఒక సూచన కూడా పార్టీ జనాలకు చేశారు. ఎన్నికల కోసం పదవుల కోసం అయితే జనసేనలోకి రావద్దు అని. పదవుల కోసం వెంపర్లాడేవారు తనకు వద్దు అని చెప్పేశారు. తాను ఒక తరాన్ని ముందుకు నడిపించడానికే పార్టీ పెట్టానని ఈ క్రమంలో పదవులు వాటంతట అవి వస్తే తీసుకోవడం వేరు కానీ పదవులే పరమావధి అనుకునేవారు పార్టీకి అవసరం లేదని పవన్ చెప్పడం కూడా చర్చగా ఉంది. రాజకీయాలు అంటే పదవులుగా అర్ధాలు మారిన ఈ రోజులలో పవన్ ఇచ్చిన ఈ పిలుపు పార్టీ జనాలకు ఏమైనా  పడుతుందా అన్నది ఒక చర్చ అయితే జనసేనలో చేరాలనుకునే బయట జనాలకు కూడా ఈ సందేశం మింగుడుపడుతుందా అన్నది మరో ప్రశ్న.