Begin typing your search above and press return to search.

జగన్‌ను తొలిసారి మెచ్చుకున్న పవన్ కళ్యాణ్, ఎందుకో తెలుసా?

By:  Tupaki Desk   |   19 Feb 2020 5:14 PM GMT
జగన్‌ను తొలిసారి మెచ్చుకున్న పవన్ కళ్యాణ్, ఎందుకో తెలుసా?
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకున్నారు. ఆయన ధైర్యంగా తీసుకున్న ఓ నిర్ణయం పై ప్రశంసలు కురిపించారు. 2017లోని కర్నూలు సీఆర్ఆర్ హైస్కూల్ విద్యార్థిని హత్యాచారం కేసును సీబీఐకి అప్పగిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పై ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం వారి కుటుంబానికి ఊరట ఇస్తుందన్నారు.

సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని జనసేనాని అన్నారు. జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సుగాలి ప్రీతి కుటుంబానికి ఒకింత ఊరట కలిగిస్తుందన్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయడంలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు సీబీఐ విచారణ ద్వారా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.

పాఠశాలకు వెళ్లిన చిన్నారి పై అఘాయిత్యానికి ఒడిగట్టి ఉసురుతీసిన వాళ్లని కఠినంగా శిక్షించాలని కర్నూలు నడిబొడ్డున లక్షలాది మంది ప్రజలు నినదించారని గుర్తు చేశారు. ప్రభుత్వంలో కదలిక వచ్చేలా సుగాలి ప్రీతి కుటుంబం వెన్నంటి ఉన్న జనసేన నాయకులకు, జన సైనికులకు, ప్రజా సంఘాలకు ఆయన అభినందనలు తెలిపారు.

సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని ఫిబ్రవరి 12వ తేదీన పవన్ కళ్యాణ్ నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కేసును తేలిగ్గా తీసుకున్నారని వైసీపీ నాయకుల పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు నేరస్తులను కాపాడుతున్నారని ఆరోపించారు. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

మంగళవారం జగన్ కర్నూలు జిల్లాలో పర్యటించి కంటి వెలుగు ప్రోగ్రాం థర్డ్ ఫేజ్‌ ను ప్రారంభించారు. ఆ సమయంలో బాధితురాలి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తామని, వారి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. బాలిక తల్లి, కుటుంబ సభ్యులను తన వద్దకు తీసుకు రావాలని, ఏం జరిగిందో వాస్తవాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసిన వారం రోజుల్లో ప్రభుత్వం అదే పని చేసింది. ఓ విధంగా ఇది జనసేనానికి విజయంగా చెప్పుకోవచ్చు. జనసేన చీఫ్ ఇలా సామాజిక సమస్యలను లేవనెత్తుతూ ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లి, సమస్యలు పరిష్కారమయ్యేలా చూడటం బాగుందని చాలా మంది ప్రశంసిస్తున్నారు. పవన్ ఇలా చేస్తే మైలేజీ రావడం ఖాయమంటున్నారు.