కేసీఆర్ వ్యూహానికి పవన్ విరుగుడు!

Tue Jan 24 2023 10:14:38 GMT+0530 (India Standard Time)

Pawan Kalyan is also writing antidote strategies to KCR's strategies

టీఆర్‌ఎస్ ను బీఆర్‌ఎస్ గా మార్చి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్నారు.. తెలంగాణ సీఎం కేసీఆర్. అయితే బీఆర్‌ఎస్ ను లైట్ తీసుకుంటున్నవాళ్లే ఎక్కువ. ఔట్ డేటెడ్ పొలిటీషియన్స్ గా పేరు పడ్డవారే ఆ పార్టీలో చేరుతున్నారని అంటున్నారు. ఇటీవల ఏపీ నుంచి చేరిన తోట చంద్రశేఖర్ మాజీ రావెల కిశోర్ బాబు ఈ కోవలోకే వస్తారని చెబుతున్నారు.మరోవైపు తన స్నేహితుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మేలు చేయడానికి జనసేన పార్టీని దెబ్బకొట్టడానికి కేసీఆర్ కాపు సామాజికవర్గంపై దృష్టి సారించారని టాక్ నడుస్తోంది. కాపు సామాజికవర్గానికే చెందిన తోట చంద్రశేఖర్ ను ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా నియమించడం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అదే వర్గానికి చెందిన శాంతికుమారిని నియమించడం ఈ కోవలోనే జరిగాయని ప్రచారం జరుగుతోంది.

ఇంకోవైపు తెలంగాణలో మున్నూరు కాపుల జనాభా ఎక్కువ. వీరు కూడా కాపుల్లోకే వస్తారు. బీజేపీ ఈసారి మున్నూరు కాపులను నమ్ముకుని తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తోంది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మున్నూరు కాపులే కావడం గమనార్హం.

దీనికి విరుగుడు అన్నట్టు కేసీఆర్ కాపు సామాజికవర్గానికే చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వద్దిరాజు రవిచంద్రను రాజ్యసభకు ఎంపిక చేశారు. ఇప్పటికే మున్నూరు కాపు వర్గానికే చెందిన కేశవరావు రాజ్యసభ సభ్యుడిగా గత రెండు పర్యాయాలుగా ఉన్నారు. బీఆర్‌ఎస్ ముఖ్య నేతల్లో ఒకరిగా కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా కేశవరావు ఉన్నారు. హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి సైతం కేశవరాజు కుమార్తే. కేసీఆర్ మంత్రివర్గంలోనూ గంగుల కమలాకర్ రూపంలో మున్నూరు కాపు మంత్రి ఉన్నారు.

ఈ నేపథ్యంలో కాపులను ఆకర్షించడానికి కేసీఆర్ పెద్ద ప్రయత్నమే చేస్తున్నారు. ఓవైపు తెలంగాణలో తాను గెలవడానికి ఏపీలో తన స్నేహితుడు జగన్ ను గెలిపించడానికి వ్యూహాలు పన్నుతున్నారు. టీడీపీ–జనసేన పొత్తు పెట్టుకున్నా.. దాని ఫలితం లేకుండా చేయాలన్నదే కేసీఆర్ ఎత్తుగడ అని చెబుతున్నారు.

మరోవైపు జనసేనాని పవన్ కల్యాణ్ సైతం కేసీఆర్ వ్యూహాలకు విరుగుడు వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ తెలంగాణలో బీజేపీతో పవన్ కలసి నడించింది లేదు. ఈ ప్రభావం హైదరాబాద్ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో కనిపించింది. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తెకే పవన్ మద్దతు ఇచ్చారు. అందులోనూ కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తో సన్నిహిత సంబంధాల నేపథ్యంలో పవన్ బీఆర్‌ఎస్ ను వ్యతిరేకించే పని ఇప్పటివరకు చేయలేదు.

అయితే ఈసారి తనను దెబ్బకొట్టేలా వ్యవహరిస్తున్న కేసీఆర్ కు పవన్ షాక్ ఇస్తారని టాక్ నడుస్తోంది. వాస్తవానికి హైదరాబాద్ నగరంలో పలు నియోజకవర్గాల్లో కాపుల ప్రాబల్యం ఉంది. అలాగే మెగాభిమానుల సంఖ్యా ఎక్కువే. అలాగే ఏపీని ఆనుకుని ఉండే కోదాడ ఖమ్మం సత్తుపల్లి కొత్తగూడెం వంటి నియోజకవర్గాల్లోనూ కాపు ఓటర్లు అధికంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ పోటీ చేస్తారని చెబుతున్నారు. తద్వారా ఇప్పటివరకు సెటిలర్ల ఓట్లను కొల్లగొడుతున్న కేసీఆర్ కు షాక్ ఇస్తారని అంటున్నారు.

ఇందులో భాగంగా పవన్ తన వారాహి వాహనానికి పూజను తెలంగాణలోనే కొండగట్టులో చేయిస్తుండటం గమనార్హం. ఈ పర్యటనలోనే కార్యకర్తలతో జనసేన పార్టీ నేతలతో పవన్ సమావేశమవుతారు. ఈ మేరకు ఇప్పటికే పవన్ షెడ్యూల్ ఖరారైంది. అలాగే ధర్మపురిలో లక్ష్మీనరసింహ స్వామిని కూడా పవన్ దర్శించుకుంటారు. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో 32 నారసింహ క్షేత్రాలను పవన్ దర్శిస్తారని తెలుస్తోంది. ఇందులో చాలావరకు తెలంగాణలోనే ఉన్నాయని అంటున్నారు. ఈ సందర్శనలో భాగంగా ఎక్కడికక్కడ పార్టీ నేతలతో సమావేశాలు కొన్ని చోట్ల సభలు కూడా ఉంటాయని పేర్కొంటున్నారు. తద్వారా వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.