Begin typing your search above and press return to search.

హిమాలయాల్లో పవన్.. ఏం చేస్తున్నారు?

By:  Tupaki Desk   |   11 Oct 2019 4:54 AM GMT
హిమాలయాల్లో పవన్.. ఏం చేస్తున్నారు?
X
దేశభక్తి, ఆధ్యాత్మికత మెండుగాగల జనసేనాని పవన్ కళ్యాణ్ తన ఆధ్యాత్మిక పర్యటనకు హిమాలయాలను ఎంచుకున్నారు. ఈ సందర్భంగా దేశంలోనే అతిపెద్ద నది అయిన గంగా ప్రక్షాళన ఉద్యమానికి బాసటగా నిలిచారు.

పవన్ కళ్యాణ్ తాజాగా ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ కు వెళ్లారు. అక్కడి పవిత్ర పుణ్యక్షేత్రం హరిద్వార్ ను సందర్శించి ప్రఖ్యాతి చెందిన మాత్రి సదన్ ఆశ్రమంలో స్వామి శివానంద మహరాజ్ ను కలుసుకున్నారు. అక్కడి వేషధారణతో గంగా హారతిలో స్వామి వార్లతో కలిసి పాలుపంచుకున్నారు.

పవన్ కళ్యాణ్ సందర్శించిన హరిద్వార్ లోని మాత్రి సదన్ ఆశ్రమానికి ఎంతో పోరాట చరిత్ర ఉంది. గంగానది ప్రక్షాళన కోసం జరిగిన పోరాటానికి మాత్రి సదన్ ఆశ్రమం వేదికగా నిలిచింది. స్వామి నిగమానంద 33 ఏళ్ల వయసులోనే గంగా ప్రక్షాళన కోసం 115 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారు. ఇక ప్రొఫెసర్ జిడి అగర్వాల్ సైతం పోరాడి ప్రాణాలు తీసుకున్నారు. వీరిద్దరి సమాధులను సందర్శించిన పవన్ నివాళులర్పించారు.

అనంతరం మాత్రి సదన్ ఆశ్రమ నిర్వాహకులు స్వామి శివానంద మహారాజ్ తో చర్చలు జరిపారు. గంగా నది ప్రక్షాళన పోరాటానికి దక్షిణాది నుంచి మద్దతు ప్రకటించారు. పోరాటానికి అండగా ఉంటామన్నారు. గంగానదిని కలుషితం చేస్తే మన సంస్కృతిని మనమే కలుషితం చేయడం అని వ్యాక్యానించారు. డెహ్రాడూన్ పర్యటనలో పవన్ అక్కడి సంప్రదాయం ప్రకారం తలపాగా చుట్టుకొని పర్యటించడం విశేషం.

ఇక పవన్ కళ్యాణ్ ఇలా సడన్ గా గంగా ప్రక్షాళనకు మద్దతివ్వడం.. ఆధ్యాత్మిక పర్యటనలతో బీజేపీ సిద్ధాంతాలకు దగ్గరకు వెళ్లడం చూస్తే ఆయన బీజేపీలో చేరిపోతారా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఈ పర్యటన ఉద్దేశం వెనుక రహస్యం ఏంటో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే..