Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ నోట‌.. కాపు మాట‌.. అందుకేనా!

By:  Tupaki Desk   |   26 Sep 2021 12:37 PM GMT
ప‌వ‌న్ నోట‌.. కాపు మాట‌.. అందుకేనా!
X
ప్ర‌తి రాజ‌కీయ నాయ‌కుడి వెన‌కాల ఓ సామాజిక వ‌ర్గం ఉంటుంది. ఆ వ‌ర్గం అండ‌తో నేత‌లు రాజ‌కీయంగా ఎదుగుతార‌నేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఆ ప్రజ‌లు కూడా త‌మ వ‌ర్గం నాయ‌కుడ‌ని చెప్పి విజ‌యాలు అందిస్తారు. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చూస్తే సీఎం జ‌గ‌న్‌కు రెడ్డి సామాజిక వ‌ర్గం అండ‌గా ఉంది. ఇక ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు విష‌యానికి వ‌స్తే ఆయ‌న‌కు క‌మ్మ సామాజిక వ‌ర్గం మ‌ద్ద‌తు ఉంది. ఈ నేప‌థ్యంలో ఏపీలో బ‌లోపేత‌మై బ‌లంగా పుంజుకోవాల‌ని భావిస్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు రాష్ట్రంలోని కాపు సామాజిక వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నారనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప‌వ‌న్ మేన‌ళ్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌ రోడ్డు ప్ర‌మాదం కార‌ణంగా ఆసుప‌త్రిలో ఉండ‌డంతో తేజ్ న‌టించిన రిప‌బ్లిక్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ప‌వ‌న్ ముఖ్య అతిథిగా వెళ్లారు. ఆ వేడుక‌లో ఆయ‌న సినిమా విష‌యాల కంటే ఎక్కువ‌గా రాజ‌కీయ అంశాలే ప్ర‌స్తావించారు. అందులో భాగంగానే కాపు రిజ‌ర్వేష‌న్ల విషయం తేవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మీడియా ప్ర‌జ‌ల త‌ర‌పున నిల‌వాల‌ని ఆయ‌న మాట్లాడుతూ.. ఏపీలో గ‌తంలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీ కాపు రిజ‌ర్వేష‌న్ల గురించి ప్ర‌శ్నించింది.. కానీ ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ విష‌యాన్ని మ‌ర్చిపోయిందని దానిపై మీడియాలో క‌థ‌నాలు చేసుకోవాల‌ని ప‌రోక్షంగా సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

తాజాగా ప‌వ‌న్ ఈ కాపు రిజ‌ర్వేష‌న్ల విష‌యాన్ని తెర‌మీద‌కు తేవ‌డంతో రాష్ట్రంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఈ అంశాన్ని ప్ర‌ధానంగా చేసుకుని ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాన్‌కు అభిమానుల బ‌లంతో పాటు కాపు సామాజిక వ‌ర్గంలోనూ మ‌ద్ద‌తు ఉంది. కానీ గ‌తంలో త‌న‌పై కాపు ముద్ర ప‌డుతుందేమోన‌న్న అభిప్రాయంతో ఆయ‌న వెన‌కంజ వేశార‌ని తెలుస్తోంది. అందుకే అప్పుడు కాపు రిజ‌ర్వేష‌న్ల గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఆ సామాజిక‌వ‌ర్గం స‌మ‌స్య‌ల‌నూ ప‌క్క‌న‌పెట్టారు. ఆ ముద్ర ప‌డితే రాజ‌కీయంగా న‌ష్టం జ‌రుగుతుంద‌ని ఆయ‌న భావించిన‌ట్లు తెలుస్తోంది. కానీ ఇన్ని రోజుల‌కు ప‌వ‌న్‌కు ప‌రిస్థితి అర్థ‌మైంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

టీపీడీ, వైసీపీ లాగే తాను కూడా ఓ సామాజిక వ‌ర్గంతో ముందుకు వెళ్లాల‌ని ప‌వ‌న్ అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఏపీలో కాపు సామాజిక‌వ‌ర్గం ఓట‌ర్లే అత్య‌ధిక శాతం ఉన్నారు. దీంతో తాను కూడా త‌న సామాజిక‌వ‌ర్గాన్ని ఎందుకు సొంతం చేసుకోకూడ‌ద‌న్న నిర్ణ‌యానికి ఆయ‌న వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. గ‌త ఎన్నిక‌ల్లో కాపులు ఆయ‌న వైపు చూడ‌లేదు. అందుకే జ‌న‌సేన‌కు ప‌ట్టు ఉన్న‌ట్లు భావిస్తున్న ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోనూ విజ‌యం ద‌క్క‌లేదు. ఇప్పుడు ఆ అవ‌స‌రాన్ని ప‌వ‌న్ గుర్తించిన‌ట్లు తెలుస్తోంది. తాను కాపు సామాజిక వ‌ర్గం నేత‌గా ముద్ర ప‌డితేనే మంచిద‌ని ప‌వ‌న్ అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. కాపుల్లో ఆయ‌న‌కు మంచి ఇమేజ్ కూడా ఉండ‌డం క‌లిసొచ్చేదే. అందుకే కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై పోరాడాల‌ని ఆయ‌న ఇప్పుడు నిర్ణ‌యం తీసుకున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నాలు వేస్తున్నారు. కానీ బీజేపీతో క‌లిసి ఉంటే అది సాధ్యం కాదు. రిజ‌ర్వేష‌న్లు కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలో ఉన్న అంశం కావ‌డంతో ఆయ‌నే కేంద్రాన్ని ఒప్పించాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీవ‌క‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మించాల‌ని నిర్ణ‌యించుకున్న ఆయ‌న ఈ నేప‌థ్యంలో బీజేపీతో పొత్తు తెచ్చుకునేందుకు సిద్ధ‌మ‌యార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కాపు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలోనూ ఆయ‌న పోరాటం చేసేందుకు ముందుకు వ‌స్తున్నారు కాబ‌ట్టి ఇక బీజేపీతో జ‌న‌సేన బంధానికి ముగింపు ప‌డిన‌ట్లేన‌ని రాజ‌కీయ నిపుణులు చెబుతున్నారు.