Begin typing your search above and press return to search.

గాలివాటు గెలుపును పవన్ ఎక్కువగా ఊహించుకున్నారా?

By:  Tupaki Desk   |   26 March 2019 1:01 PM GMT
గాలివాటు గెలుపును పవన్ ఎక్కువగా ఊహించుకున్నారా?
X
ప్యాక్టరీల సైరన్ మోతలు, వాహనాల రణగొణ ధ్వనులు. తెల్లవారితే పొట్ట చేత పట్టుకొని పరుగులెట్టే జనాలు.. వెరసి నాలుగు లక్షల మంది జనాభా.. 36 ఉక్కు నిర్వాసిత కాలనీలు, 52 మురికివాడలు, 8 కొండవాలు కాలనీలు, 10 వుడా కాలనీలు, 6 సంపన్న వర్గాల కాలనీలు.. మొత్తంగా 14 డివిజన్లలో విస్తరించిన నియోజకవర్గం గాజువాక!

ఈ నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో గెలుపు అవకాశాల గురించి చెప్పమంటే.. చాలా మంది చెప్పే మాట పవన్ ఎలాగూ తన సామాజికవర్గం జనాలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లోనే నామినేషన్ వేశారు. కాబట్టి ఆయన గెలుపు కష్టం ఏమీ కాదు అని అంటారు. ఆ పై దానికి రెండో లాజిక్.. రెండు వేల తొమ్మిదిలో గాజువాకలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి నెగ్గారు కాబట్టి.. అక్కడ పవన్ కు విజయావకాశాలు ఉన్నాయని అంటారు. ఇంతకు మించి వేరే లాజిక్కులు ఏమీ లేవు. అయితే ఇవన్నీ ఆర్మ్ చైర్ మాటలు. కుర్చీలో కూర్చుని ఇలాంటి మాటలను ఎన్నింటినైనా చెప్పవచ్చు. అయితే రాజకీయంలో ఈ పడక్కుర్చీ విశ్లేషణలు ఏనాడూ నిజం కావు. క్షేత్ర స్థాయి పరిస్థితి వేరు, పైకి కనిపించేది వేరు!

-గాజువాక నియోజకవర్గం పరిస్థితి గురించి క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే ఇక్కడ కులం అనేదే ప్రధానమైన ఫ్యాక్టర్ కాదు అని స్పష్టం అవుతుంది.

-గాజువాక ప్రధానంగా పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ జనాలు కులం అనే సంగతి కన్నా, తామంతా కార్మికులం, అదే తమ కులం అనే భావనను వ్యక్తం చేస్తూ ఉన్నారు.

- స్టీల్ ప్లాంట్, బీహెచ్ ఈఎల్, ఆటోనగర్, జింక్, కోరమాండల్, హెచ్పీసీఎల్ వంటి సంస్థల్లో పని చేసే వారే ఈ నియోజకవర్గం పరిధిలో ఎక్కువగా ఉంటారు.

-ఇలాంటి ప్రాంతంలో సహజంగానే స్థానిక సమస్యలు, తమకు అండగా ఉండే నేతను కార్మికులు కోరుకుంటారు. అందుకే ఇక్కడ కమ్యూనిస్టులు కూడా కొద్దో గొప్పో మూలాలను కలిగి ఉన్నారు.

-అయితే స్థానికంగా ఉండే నేతనే ఇలాంటి వర్గాలు ఎంచుకునే అవకాశాలున్నాయి. ఏ గ్రామీణ ప్రాంతమో అయితే సెలబ్రిటీని తమ ఎమ్మెల్యేగా ఉహించుకోవడానికి ఉత్సాహం చూపవచ్చు. అయితే కష్టించి పని చేయడమే దినచర్యగా కలిగిన ప్రాంతంలో సెలబ్రిటీలకు ఆదరణ ఉంటుందా? అనేది ప్రశ్నార్థకమే.

-పవన్ కల్యాణ్ గెలిస్తే..స్థానికంగా అందుబాటులో ఉంటారా? అనేది చాలా సులువుగా సమాధానం దొరికే ప్రశ్న. పవన్ దరిదాపుల్లోకి కూడా ఏ సామాన్యుడూ వెళ్లలేడు. వెళ్లాలని ప్రయత్నించినా.. ఆయన చుట్టూ ఉండే సినీ అభిమానుల గందరగోళం వారిని పవన్ దగ్గరకు వెళ్లనీయకపోవచ్చు.

-ఇప్పటి వరకూ నియోజకవర్గం స్థాయిలో పవన్ కల్యాణ్ ఆఫీసును కానీ, ఒక ఇంటిని అయినా రెంట్ కు తీసుకోకపోవడం గమనార్హం!

-రెండు చోట్ల పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్ ఏదో ఒక దానికి రాజీనామా చేయాల్సి ఉంది. భీమవరానికి ఇచ్చినట్టుగా వరాలను కూడా పవన్ గాజువాకకు ఇవ్వకపోవడం మరో ఆసక్తిదాయకమైన అంశం.

-పవన్ ను గెలిపిస్తే ఆయన స్థానికంగా ఉంటారా? అందుబాటులో ఉంటారా? అనే ప్రశ్నలతో పాటు వెంటనే రాజీనామా చేసి భీమవరం వైపు వెళ్లిపోతే అప్పుడైనా మళ్లీ ఎన్నికలు రావాల్సిందే కదా.. అనేది స్థానికుల్లో చర్చనీయాంశం.

-స్థానిక సమస్యల గురించి పవన్ కల్యాణ్ కు ఏ మేరకు అవగాహన ఉంటుంది? అనేది సులభంగా అర్థం చేసుకోదగిన అంశమే. కేవలం కుల సమీకరణాలు, సినీ అభిమానాన్ని సర్వేల్లో ఇక్కడ గట్టిగా ఉందనే అభిప్రాయాలతోనే పవన్ ఇక్కడ నామినేషన్ వేశారనే అభిప్రాయం రాష్ట్రమంతటా వినిపిస్తూ ఉంది!

-ఇక ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయడానికి కూడా వీళ్లేదు.

-రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం ఇక్కడ నెగ్గింది అంటే అది వేరే కథ. కాంగ్రెస్ పార్టీ రెబల్ భారీగా ఓట్లను చీల్చడం ఏకంగా ముప్పై వేలకు పైగా ఓట్లను చీల్చడం, తెలుగుదేశం పార్టీ అప్పుడు పోటీలో లేకపోవడం.. వంటి కారణాలు ప్రజారాజ్యం గెలుపును సాధ్యం చేశాయి.

-ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పవన్ కల్యాణ్ కు సహకారం అందిస్తుందనే పరిస్థితి ఉంది. అదే పవన్ కల్యాణ్ గెలుపు ఆశలను కలిగిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది!