పీకే లెక్క!... జనసేనకు 15 సీట్లట!

Mon Apr 22 2019 17:10:03 GMT+0530 (IST)

Pawan Kalyan Expects Close To 15 Seats For Jana Sena

ఏపీలో ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ముగిసిపోయింది. ఫలితాల వెల్లడికి ఇంకా నెల రోజుల పాటు వెయిట్ చేయక తప్పదు. ఈ నేపథ్యంలో ఫలితాలపై లెక్కలేనన్ని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇక రాజకీయ పార్టీలు అయితే... ఎన్నికల్లో తమదే విజయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల్లో బాగానే పోటీ ఇచ్చామన్న భావనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వర్గం కూడా గెలుపు ధీమానే వ్యక్తం చేస్తోంది. అయితే ఆ ధీమా పవన్ కల్యాణ్ లో కనిపించడం లేదన్న కొత్త వాదన ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఓ రెండు రోజులకు మీడియా ముందుకు వచ్చిన ఆ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి - సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ... జనసేనకు 88 సీట్లలో విజయం దక్కనుందని - ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అదే విషయాన్ని ఆయన పదేపదే చెప్పుకొచ్చారు.అయితే లక్ష్మీనారాయణలో ఉన్నంత మేర గెలుపు ధీమా పవన్ లోనూ లేదన్న వాదన ఇప్పుడు వినిపిస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత దాదాపుగా కనిపించకుండా పోయిన పవన్ కల్యాణ్... ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఇటీవల హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో ఆయన ముఖ్య నేతలతో ఓ సమీక్షను నిర్వహించారట. ఈ సందర్భంగా ఏపీ ఎన్నికల్లో జనసేన ఎన్ని సీట్లను సాధిస్తుందన్న అంశంపైనా చర్చ జరగగా... పవన్ తన అంచనాను బయటపెట్టారట. ఇప్పటిదాకా వెలువడిన సర్వేలన్నీ జనసేనకు 1 నుంచి 3 సీట్లు వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నాయి. కొన్ని సర్వేలు అయితే అసలు పవన్ పార్టీకి సున్నానే అని చెప్పేశాయి.

వీటన్నింటినీ ఎంతమాత్రం పట్టించుకోవద్దని పార్టీ నేతలకు చెప్పిన పవన్.. ఏపీలో తమకు 15 సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారట. ఈ సంఖ్యను చెప్పడంతో పాటుగా ఆ సీట్లు ఏవన్న విషయాన్ని కూడా పవన్ పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. పవన్ అంచనా ప్రకారం ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖ - ఉత్తరాంధ్రల్లో పార్టీకి మంచి ఓటింగ్ పడిందని రాయలసీమలో ప్రత్యేకించి కర్నూలు జిల్లాలో తమకు సీట్లు వస్తాయని కూడా ఆయన చెప్పుకొచ్చారట. పవన్ లెక్క సరే గానీ.. తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి స్తాపించి మూసేసిన ప్రజారాజ్యం పార్టీకి 2009లో ఏకంగా 18 సీట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు తమ్ముడి పార్టీగా బరిలోకి దిగిన జనసేనకు అంతకంటే తక్కువగా 15 సీట్లే రానున్నాయని పవన్ చెబుతున్నారంటే పరిస్తితి ఎలా ఉందో ఇట్టే అర్థం కాక మానదు.