Begin typing your search above and press return to search.

బద్వేలులో బీజేపీ తరుఫున పవన్ ప్రచారం చేయడా?

By:  Tupaki Desk   |   23 Oct 2021 1:30 AM GMT
బద్వేలులో బీజేపీ తరుఫున పవన్ ప్రచారం చేయడా?
X
బద్వేలు బరి ఆసక్తి రేపుతోంది. ఏపీ రాజకీయ వర్గాల్లో హీట్ పెంచుతోంది. ఏపీలోని బద్వేల్ నియోజకవర్గానికి ఈనెల 30న ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ వైసీపీ అభ్యర్థినిపై ఉన్న సానుభూతితో టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కుడా తాము బరిలో ఉండమని ముందుగానే ప్రకటించారు. కానీ తాను మైత్రీ కొనసాగిస్తున్న బీజేపీ మాత్రం పోటీలో నిలబడింది. వారసత్వ రాజకీయాలకు తాము దూరం అని చెబుతూ ఈ పోటీలో నిల్చున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. అయితే బీజేపీ తమకు జనసేన మద్దతు ఉందని, త్వరలో పవన్ కల్యాణ్ తమపార్టీ తరుపున ప్రచారం చేస్తారని బీజేపీ నాయకులు అంటున్నారు. కానీ పవన్ మాత్రం ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఉప ఎన్నిక ప్రచారం ముగుస్తున్నా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఇక పవన్ ఉప ఎన్నికకు దూరంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

2019 అసెంబ్లీ ఎన్నికల తరువత బీజేపీ,జనసేన కలిసిపోయాయి. పలు కార్యక్రమాల్లో రెండు పార్టీలు పాల్గొనేవి. అయితే తిరుపతి ఉప ఎన్నికలో తమకు సీటు కావాలని జనసేన పట్టుబట్టింది. కానీ అధిష్టాన నిర్ణయంతో బీజేపీ బరిలో నిల్చుంది. అయితే పవన్ బీజేపీ తరుపున ప్రచారం చేశారు. ఈ ఎన్నికలో వైసీపీ అభ్యర్థి 3 లక్షల మెజారిటీ సాధించగా రెండో స్థానంలో టీడీపీ, మూడో స్థానంలో బీజేపీ వచ్చింది. ఆ తరువాత నుంచి జనసేన బీజేపీకి దూరంగా ఉంటూ వస్తోంది. సమావేశాలు, బహిరంగ సభలు జనసేన ఒంటరిగానే నిర్వహిస్తోంది.

గత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ, జనసేన ఒక్కటేనని కొన్ని సీట్లలో బీజేపీ పోటీ చేసింది. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం జనసైనికులు కూడా బరిలో నిల్చున్నారు. పార్టీ అధినేత స్థాయిలో పొత్తు ఉన్నా కింది స్థాయి కార్యకర్తల్లో మాత్రం బీజేపీ, జనసేనలు దూరంగానే ఉంటూ వస్తున్నాయి. దీంతో ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన నిల్చున్న స్థానాల్లో కొన్ని సీట్లను కైవలం చేసుకుంది దీంతో బీజేపీతో కలిసి వెళ్లేకంటే ఒంటరిగా పోటీ చేస్తే లాభిస్తుందని జనసైనికులు తమ అధినేతకు వివరించినట్లు తెలిసింది.

కార్యకర్తల గోడు విన్న పవన్ సైతం ఒంటరిగానే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల నిర్వహించిన కొన్ని ఆందోళన కార్యక్రమాల్లో పవన్ ప్రభుత్వంపై ఒంటరిగానే పోరాడుతున్నారు. రోడ్ల అధ్వానస్థితిపై పవన్ తన నాయకులతో కలిసి శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించి కొన్ని చోట్ల రోడ్లు మరమ్మతులు చేపట్టింది. ఇలాంటి సందర్భంగా బీజేపీ నాయకులు ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.

ఇక బద్వేల్ విషయానికొస్తే పవన్ ముందుగానే పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. కానీ ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ మాత్రం బీజేపీకి మద్దుత ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే బీజేపీ నాయకులు మాత్రం తమ పార్టీ తరుపున పవన్ ప్రచారం చేస్తారని చెబుతూ వస్తున్నారు కానీ పవన్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరో రెండు, మూడు రోజుల్లో ఉప ఎన్నిక ప్రచారం ముగుస్తున్న తరుణంలో ఇప్పటి వరకు పవన్ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో ఇక పవన్ ఈ ఉప ఎన్నికకు దూరంగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకవేళ పవన్ బద్వేల్ ప్రచారానికి రాకపోతే బీజేపీ నాయకులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. కానీ జనసైనికులు మాత్రం ముందే పోటీ నుంచి తప్పుకొని ఇప్పుడు ప్రచారం చేస్తే రిమార్క్ వస్తుందని అంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసే ఉంటాయా..? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయని చర్చించుకుంటున్నారు.