మండలి రద్దు తీర్మానంపై పవన్ కళ్యాణ్ అసహనం

Tue Jan 28 2020 08:54:31 GMT+0530 (IST)

Pawan Kalyan Comments On Sasana Mandali Raddu

శాసన మండలి రద్దుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. మండలిని రద్దు చేయడం సరైన చర్య కాదన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పునరుద్ధరించిన మండలిని ఇప్పుడు రద్దు చేయడం సమంజసం కాదన్నారు. రాజ్యాంగ రూపకర్తలు ఎంతో ముందుచూపుతో శాసన సభ శాసన మండలి ఏర్పాటుకు అవకాశం కల్పించారన్నారు. శాసన సభలో ఏదైనా నిర్ణయం పొరపాటుగా తీసుకుంటే దానిపై పెద్దల సభలో మేథోపరమైన చర్చ జరగాలనే మంచి ఉద్దేశ్యంతో మండలిని ఏర్పాటు చేశారన్నారు.ఇలాంటి మండలిని రద్దు చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థలను తొలగించుకుంటూ పోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆందోళన వ్యక్తం చేశారు. మండలి రద్దుకు ప్రజామోదం ఉందా చెప్పాలని నిలదీశారు. ప్రజల కోణాన్ని పరిగణలోకి తీసుకోలేదన్నారు. వికేంద్రీకరణ బిల్లు మండలిలో నిలిచిపోతే దీని కోసం మండలిని రద్దు చేయడం ఏమిటని ప్రశ్నించారు. పెద్దల సభ రద్దు అంటే మేథావుల ఆలోచనలను అభివృద్ధికి వినియోగించుకునే అవకాశం కోల్పోయినట్లే అన్నారు.

కాగా ఏపీ శాసన మండలి రద్దుకు శాసన సభ సోమవారం ఆమోదం తెలిపింది. మండలి రద్దుపై ముఖ్యమంత్రి జగన్ ఉదయం తీర్మానం ప్రవేశ పెట్టగా చర్చలో పాల్గొన్న సభ్యులు అందరూ మండలి రద్దుకు మొగ్గు చూపారు. చివరకు మండలి రద్దుకు గల కారణాలను జగన్ వివరించారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్‌కు అనుకూలంగా 133 మంది ఉన్నారు. వ్యతిరేకంగా తటస్థంగా ఎవర లేరని స్పీకర్ ప్రకటించారు.