జనసేన ఆవిర్భావానికి బీజం పడింది అప్పుడేః పవన్ కల్యాణ్

Sun Feb 28 2021 21:00:01 GMT+0530 (IST)

Pavankalyan About Janasena

అటు రాజకీయాలు ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. రెండు విషయాలనూ మేళవిస్తూ జమిలిగా ముందుకు సాగుతున్నారు. తాజాగా.. శనివారం జనసేన తెలంగాణ మహిళా విభాగం నేతలతో సమావేశమయ్యారు పవన్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. జనసేన పార్టీ ఆవిర్భానికి బీజం ఎప్పుడు.. ఎక్కడ పడిందో వెల్లడించారు పవన్ కల్యాణ్.1999లో వచ్చిన 'తమ్ముడు' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా 100 రోజుల వేడుక సందర్భంగా జనసేన పార్టీ ఆవిర్భావానికి ప్రేరణ కలిగించే సంఘటన ఒకటి జరిగిందని వివరించారు పవన్. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాధి ఎక్కువగా ఉన్న ఒక గ్రామం గురించి విని ఆ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని అనుకున్నానని తెలిపారు.

తన వద్ద ఉన్న డబ్బుతో అక్కడి ప్రజలకు మంచి చేయాలని ప్రయత్నించానన్నారు. ఇందుకోసం 'తమ్ముడు' 100 రోజుల ఫంక్షన్ వదిలేశానని చెప్పారు పవర్ స్టార్. కానీ.. తన ప్రయత్నాలకు లోకల్ నాయకులు అడ్డుపడ్డారని చెప్పారు. దీంతో.. ఒక ఎన్జీవో ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమస్య పరిష్కారకం కాబోదనే విషయాన్ని గుర్తించానని చెప్పారు పవన్. కేవలం రాజకీయాల్లోకి రావడం ద్వారానే సమూల మార్పు సాధ్యమవుతుందన్న విషయం అర్థమైందన్నారు. ఆ విధంగానే తాను రాజకీయాల్లోకి వచ్చానని తాను పార్టీ ఏర్పాటు చేయడానికి ఆ సంఘటనే ప్రేరణగా నిలిచిందని వెల్లడించారు.

తెలంగాణపై తనకున్న ప్రేమ అభిమానాన్ని కూడా వెల్లడించారు పవన్. “ఆంధ్ర నాకు జన్మనిచ్చింది.. కానీ తెలంగాణ నాకు జీవితాన్నిచ్చింది. జనసేన తెలంగాణ గడ్డపైనే పురుడు పోసుకుంది. నేను రాజకీయ విజ్ఞానం తెలంగాణలో పొందాను”అని చెప్పారు పవన్. ప్రత్యేక తెలంగాణ కోసం నిస్వార్థంగా ప్రాణ త్యాగాలు చేసిన వారికి నివాళిగానే.. ఇన్నాళ్లూ తెలంగాణలో జనసేనను బలోపేతం చేయడానికి ప్రయత్నించలేదని చెప్పారు పవన్.