Begin typing your search above and press return to search.

తాళం పగులకొట్టి.. తలుపు బద్దలు కొట్టి పట్టాభి అరెస్టు

By:  Tupaki Desk   |   21 Oct 2021 4:26 AM GMT
తాళం పగులకొట్టి.. తలుపు బద్దలు కొట్టి పట్టాభి అరెస్టు
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్య చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా హై డ్రామా చోటు చేసుకుంది. బుధవారం ఉదయం నుంచి ఆయన్ను అరెస్టు చేయటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. సాయంత్రానికి కన్ఫర్మ్ కావటమే కాదు.. ఆయన్ను అరెస్టు చేయటానికి ఏ విధానాన్ని అనుసరించాలన్న దానిపై పోలీసులు పెద్ద ఎత్తున కసరత్తు చేశారని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. బుధవారం రాత్రి 9 గంటల వేళలో పట్టాభి ఇంటి వద్ద ఉన్న పోలీసులు ఇంటి బెల్ కొట్టినా తలుపులు తీయలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించిన తలుపు తీయకపోవటంతో.. తాళం పగులకొట్టి.. తలుపులు బద్ధలు కొట్టి మరీ ఇంట్లోకి ప్రవేశించిన పట్టాభిని అరెస్టు చేశారు. తన భర్తను అరెస్టు చేసే విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును పట్టాభి సతీమణి తీవ్రంగా తప్పు పట్టారు.

‘‘తలుపు పగులగొట్టి.. ఇంట్లోకి వచ్చి తీసుకెళ్లటం సరికాదు. నోటీసు ఇచ్చిన వెంటనే నా భర్తను అరెస్టు చేశారు. 120 -బి సెక్షన్ కింద కేసు నమోదు చేశామని చెబుతున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే తర్వాత ఇస్తామన్నారు. నా భర్త ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే తిరిగి రావాలి. నా భర్తకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత’’ అని చందన వ్యాఖ్యానించారు.

మంగళవారం మీడియాతో మాట్లాడిన పట్టాభి.. ఏపీ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్య చేశారని.. దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు వ్యక్తులు పట్టాభి ఇంటి మీద దాడికి పాల్పడటం తెలిసిందే. ఇంట్లోని సామాను ధ్వంసం చేయటంతో పాటు.. టీడీపీ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని సైతం ధ్వంసం చేశారు. ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి పైన విజయవాడ గవర్నర్ పేట పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్న ఆయన్ను ఎక్కడకు తీసుకెళుతున్న విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తనను పోలీసులు కస్టడీలోకి తీసుకున్న వేళ.. పట్టాభి మాట్లాడుతూ.. తనకు ఏం జరిగినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ దే బాధ్యతగా పేర్కొన్నారు. అరెస్టుకు ముందు వీడియో సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు. ప్రస్తుతం తన ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని.. పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని.. వీడియో ద్వారా వెల్లడించారు.

డ్రగ్స్ విషయం మీద టీడీపీ చేస్తున్న పోరాటంపై కక్ష కట్టిన పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. తన ఇంటికి వచ్చి.. తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసిన వారిని.. తన ఫర్నీచర్.. ఆస్తుల్ని ధ్వంసం చేసిన వారిని పట్టుకోకుండా తనను అరెస్టు చేయటం ఏమిటని ప్రశ్నించారు. తనను అరెస్టు చేసి ఎంపీ రఘురామ రాజు మాదిరే దాడి చేయాలన్న ఆలోచనలో పోలీసులు ఉన్నారన్నారు. తనకేం జరిగినా కోర్టులో పోలీసులు సమాధానం చెప్పాల్సి వస్తుందని పేర్కొన్నారు. హైడ్రామా నడుమ పట్టాభిని అదుపులోకి తీసుకోవటం పూర్తైంది. ఆయన్ను ఆసుపత్రిలో పరీక్షలు జరిపి.. అనంతరం కోర్టు ముందు హాజరుపరుస్తారని చెబుతున్నారు.