మాది సీమరక్తం.. చంద్రబాబు మారాలి!

Fri Oct 22 2021 14:00:01 GMT+0530 (IST)

Paritala Sunita made sensational comments on Chandrababu

తెలుగుదేశం పార్టీలో మళ్లీ ముసలం మొదలైంది. అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి జారడంతో ఇప్పుడా పార్టీలో అసమ్మతులు అసంతృప్తులు గళమెత్తుతున్నారు. టీడీపీకి నమ్మినబంటుగా ఉన్న మాజీ మంత్రి పరిటాల సునీత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఓకే అంటే ఏం చేయడానికైనా సిద్ధమేనన్నారు. చంద్రబాబు ఇకనైనా మారాలని.. ఆయన గంట కళ్లు మూసుకుంటే కథ వేరేలా ఉంటుందని వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.తమదీ సీమ రక్తమేనని.. తమకు బీపీ వస్తుందని పరిటాల సునీత ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జరుగుతోన్న రాజకీయ రగడపై హాట్ కామెంట్స్ చేశారు. అటు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటు వైసీపీ నేతల తీరుపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు సైతం మండిపడ్డారు. తమ నేతలపై ఏపీ మంత్రులు బూతు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాము ఏపీలో అధికారంలోకి వస్తామని.. జగన్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తించుకోవాలంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు.

ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోన్న ఏపీ మంత్రులతోపాటు అందరినీ ప్రజాస్వామ్య పద్ధతిలోనే తరిమి కొడుతామని సునీత తెలిపారు. ఎన్నో కేసుల్లో జగన్ ముద్దాయిగా ఉన్నారని సునీత గుర్తు చేశారు. ఏపీలోని 28వేల ఎకరాల్లో సాగవుతున్న గంజాయి గురించి తాము చెబుతోంటే దాన్ని పక్కదారి పట్టించడానికే తమ కార్యాలయాలు ఇళ్లపై దాడులు జరుపుతున్నారని దేవినేని చెప్పారు.

రాష్ట్రంలో విద్యుత్ ధరలను పెంచేశారని.. ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. కాగా... తిరుపతిలో వైసీపీ జనాగ్రహ దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. చంద్రబాబు దిష్టబొమ్మకు వైసీపీ నేతలు శవయాత్ర నిర్వహించారు. మరోవైపు టీడీపీ నేతలు నిరశన దీక్షలతో హోరెత్తిస్తున్నారు.