అనుమానాస్పదంగా నటి మృతి.. పుట్టినరోజే ఆఖరి రోజు

Fri May 13 2022 21:00:01 GMT+0530 (IST)

Parents of Kerala Model Doubt Son In law on Daughter Death

పుట్టినరోజే ఆమెకు ఆఖరిరోజు అయ్యింది. బర్త్ డే నాడు తన కుటుంబ సభ్యులను కలవాలనుకున్న ఆమె కోరిక తీరకుండానే అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే ఆమెది సాధారణ మరణం కాదని.. భర్తే హత్య చేసి ఉంటాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.కేరళకు చెందిన ప్రముఖ నటి మోడల్ షహానా అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. కాసర్ ఘడ్ లోని తన నివాసంలో షహానా మృతదేహం ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. అయితే ఇది ముమ్మాటికీ హత్యేనని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. హహానాను భర్త సజ్జద్ హత్య చేసినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హహానాకు గత ఏడాది పెళ్లయ్యింది. 20 ఏళ్ల చిన్న వయసులోనే ఆమె మోడలింగ్ రంగంలో టాప్ గా నిలిచింది. భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందని చాలాసార్లు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు షహానా. సజ్జద్ ను పోలీసులు విచారిస్తున్నారు.

గత కొంతకాలంగా ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది.  షహానాను చాలా కాలం నుంచి భర్త సజ్జద్ చిత్రహింసలు పెట్టినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. షహానా ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

షహానా మృతిపై పోలీసులు మాట్లాడుతూ.. ‘షహానా ఓ తమిళ సినిమాలో నటించినందుకు ఆమెకు పారితోషికం వచ్చింది. ఆ డబ్బు గురించి భార్యభర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే షహానా బర్త్ డే రోజు కూడా సజ్జద్ ఆలస్యంగా రావడంతో మరోసారి తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. ఆ తర్వాత బాత్రూమ్ లో ఆమె శవమై కనిపించింది.

ఇది హత్యా? ఆత్మహత్య? అన్నది విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.  అత్తింట్లో వేధింపులు భరించలేక కొద్దిరోజుల క్రితమే ఇంటి నుంచి బయటకు వచ్చేసి భర్తతో కలిసి అద్దెంట్లో నివసిస్తోంది షహానా.. ఇదే సమయంలో ఆమె మృతి చెందడం పలు అనుమానాలకు దారితీస్తుంది.