Begin typing your search above and press return to search.

పాక్ లో తెలుగోడు దొరికాడు.. అసలు ఎందుకెళ్లాడు?

By:  Tupaki Desk   |   19 Nov 2019 4:02 AM GMT
పాక్ లో తెలుగోడు దొరికాడు.. అసలు ఎందుకెళ్లాడు?
X
ఆన్ లైన్ లో పరిచయమైంది. ప్రేమలో పడ్డాడు కుర్రాడు. ఆ అమ్మాయి కోసం వెతుక్కుంటూ దేశం కాని దేశం.. అందునా పాకిస్తాన్ కు వెళ్లాడో తెలుగు యువకుడు. పోలీసులకు చిక్కిన అతగాడి వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. పాక్ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్న అతన్ని తొలుత హైదరాబాదీగా భావించినా.. అతని స్వస్థలం మాత్రం విశాఖపట్నంగా గుర్తించారు.

ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉండి.. పాక్ కోర్టుకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా అక్కడి భద్రతా దళాల అనుమతితో తెలుగులో వీడియో సందేశాన్ని తన తల్లిదండ్రులకు ఇచ్చాడు. ఎలాంటి బెరుకు లేకుండా ఉన్న అతడి మాటల్లో.. తాను త్వరలోనే బయటకు వచ్చేస్తానన్న ధీమా కనిపించింది.

కాకుంటే.. భారత ప్రభుత్వం నుంచి సాయం అవసరమన్న విషయాన్ని అతగాడు వెల్లడించాడు. పాక్ భద్రతా దళాలకు పట్టుబడిన వ్యక్తిని ప్రశాంత్ గా గుర్తించారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన అతడ్ని పాక్ లోని బహావల్ పూర్ వద్ద కొలిస్థాన్ ఏడారిలో అరెస్టు చేశారు. హైదరాబాద్ లో ఉంటున్న అతను ఆన్ లైన్ లో పరిచయమైన అమ్మాయి కోసం.. ఆమెను వెతుక్కుంటూ పాకిస్థాన్ వెళ్లాడు. గూగుల్ మ్యాప్ సాయంతో ఆమె ఆచూకీ కోసం వెతుకుతున్న అతన్ని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.

పాస్ పోర్టు.. వీసా లాంటివి ఏమీ లేకుండా పాక్ భూభాగంలోకి ప్రవేశించిన అతనితో పాటు.. అతని స్నేహితుడు.. మధ్యప్రదేశ్ కు చెందిన టెకీ దరీలాల్ ను ఆ దేశ భద్రతాబలగాలు అరెస్టు చేశాయి. పాక్ లో ఉగ్రదాడులకు పాల్పడేందుకే ఆ ఇద్దరూ దాయాది దేశంలో అక్రమంగా ప్రవేశించినట్లు అక్కడి స్థానిక మీడియా చెబుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తాజాగా భద్రతాబలగాలకు పట్టుబడిన అతను.. రెండేళ్ల క్రితమే పాక్ భూభాగంలోకి వెళ్లినట్లు చెబుతున్నారు.

ప్రేమ విఫలం కావటంతో మతిస్థిమితం కోల్పోయినట్లుగా భావిస్తున్నారు. ఇక.. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న అతడి వీడియో సందేశంలో తన తల్లిదండ్రుల్ని ఉద్దేశించి మాట్లాడాడు. ‘‘మమ్మీ.. డాడీ బాగున్నారా? ఇక్కడ అంతా బాగుంది.. ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తెచ్చారు. ఇక్కడి నుంచి జైలుకు పంపిస్తారు. జైలు నుంచి భారత రాయబార కార్యాలయానికి సమాచారం ఇస్తారు. అప్పుడు మీతో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఇంకో నెల రోజుల్లో విడుదల కావొచ్చు’’ అని పేర్కొన్నాడు. అయితే.. ఇప్పుడు వైరల్ అయిన వీడియో సందేశం రెండేళ్ల క్రితం నాటిదని చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.