మరో శ్రీలంక గా పాక్.. వివాహ వేడుకలపై నిషేధం!

Sat Jul 02 2022 07:00:01 GMT+0530 (IST)

Pakistan as another Sri Lanka Ban on wedding ceremonies

ఓ వైపు కాగితపు కొరత.. మరోవైపు టీ వాడకాన్ని తగ్గించాలని మంత్రి వ్యాఖ్యలు.. అంతేకాకుండా వివాహ వేడుకలపై ఆంక్షలు.. విద్యుత్ టారిఫ్ లను పెంచడం పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు... దాయాది దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఇవి. వీటన్నింటిని చూస్తుంటే పాకిస్థాన్ మరో శ్రీలంక కాబోతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆ దేశాన్ని నిధుల కొరత సమస్య వేధిస్తోంది. అందుకే ఉన్న వనరులను పొదుపుగా వాడుకుంటూ... ఆదాయాన్ని పెంచుకునేందుకు పాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో విధించిన పలు ఆంక్షలు పన్నులపై పాక్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.విదేశీ మారక నిధులు తగ్గిపోతున్నాయని... ఈ క్రమంలో పాక్ ప్రజలంతా టీ తాగడాన్ని కాస్త తగ్గించాలని ఆ దేశ మంత్రి ఇటీవల వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ టీ వాడకాన్ని కాస్త తగ్గిస్తే దిగుమతి భారం తగ్గుతుందని  ఆ దేశ ప్రణాళిక శాఖ మంత్రి పేర్కొన్నారు. దీనిపై పాక్ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమపై పన్నులు విధిస్తున్నారని... అంతేకాకుండా టీ కప్పులు కూడా లాక్కుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఓ వైపు సామాన్యులపై ఇలా ఆంక్షలు విధిస్తూ... వారు మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు కాగితపు కొరత కూడా పాక్ ను వేధిస్తోంది. ఫలితంగా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు అక్కడి విద్యార్థులకు అందుబాటులోకి రావడం కష్టమేనని ఆ దేశ పేపర్ అసోసియేషన్ ఇదివరకే ప్రకటించింది. కాగితపు దిగుమతులపై భారీగా పన్ను విధింపు... స్థానిక కాగితపు పరిశ్రమల గుత్తాధిపత్యం వెరసి కాగితపు సంక్షోభానికి దారి తీసిందని పేర్కొంది. అయితే దీనివల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.

పాఠ్యపుస్తకాల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎక్కువ మొత్తంలో పాఠశాలల యాజమాన్యాలు వసూలు చేస్తాయని భావిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు అనేవి తప్పనిసరి కాబట్టి.. ఒకవేళ ఇవి అందరికీ అందుబాటులోకి రాకపోతే స్టూడెంట్స్ నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

పాక్ ను వేధిస్తున్న మరొక ప్రధాన సమస్య విద్యుత్. కరెంట్ ను తక్కువగా వినియోగించాలని ఆ దేశ ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. విద్యుత్ ను ఎక్కువగా వినియోగించకుండా ఉండడానికి రాత్రి వేళలో జరిగే వివాహ వేడుకలపై నిషేధం విధించింది. పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో రాత్రి పది దాటిన తర్వాత పెళ్లిళ్లను జరపకూడదని ఆదేశించింది. అంతేకాకుండా శనివారం నాడు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవును ప్రకటించే ఆలోచన చేస్తోంది.

ఈ విధంగా పాకిస్థాన్ ప్రస్తుతం అనేక సంక్షోభాలతో సతమతమవుతోంది. అయితే వీటన్నింటికీ ఆ దేశ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే కారణమని విశ్లేషకులు అంటున్నారు. లాభదాయకంగా లేని ప్రాజెక్టులపై ఎక్కువ ఖర్చు పెట్టడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. అమెరికా డాలర్ తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి క్రమంగా పడిపోయిందని... అంతేకాకుండా ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ లో గ్రే లిస్టింగ్ వంటివి పెట్టుబడులను దూరం చేశాయని ఐసీడబ్ల్యూఏ అభిప్రాయపడింది. అయితే పరిస్థితులను చూస్తుంటే పాక్ మరో శ్రీలంక కాబోతుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.