పాక్ కు గట్టి జవాబిచ్చిన కాంగ్రెస్ సీఎం!

Tue Aug 13 2019 22:36:37 GMT+0530 (IST)

పాకిస్తాన్ కు మాటల ద్వారా కూడా ధీటుగా సమాధానం ఇచ్చే  కాంగ్రెస్ నేతల్లో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ముందుంటారు. సైన్యంలో చాలా కాలం పాటు పని చేసి కెప్టెన్ ర్యాంక్ వరకూ ఎదిగారు ఈ పంజాబీ నేత. రాజకీయంగా రాణించి - పాలిటిక్స్ లో కూడా  'కెప్టెన్' అనిపించుకున్నారు అమరీందర్. ఇప్పుడు పంజాబ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు.



ఈ క్రమంలో వివిధ అంశాలపై పాక్ కు గట్టి జవాబ్ ఇస్తూ ఉంటారు. పాక్ తో సరిహద్దును కలిగి ఉన్న పంజాబ్  రాష్ట్ర ముఖ్యమంత్రిగా అమరీందర్ ఈ మాత్రం స్పందించడం మంచిదే. ఈ క్రమంలో తాజా పరిణామాలపై ఆయన ట్వీట్ చేశారు.

కశ్మీర్ అంశం తర్వాత ఇండియాలో చిచ్చు పెట్టాలని పాక్ ప్రయత్నాలు సాగిస్తూ ఉంది. అందులో భాగంగా పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌదరి .. పంజాబీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. భారత సైన్యంలో పంజాబీలు పని చేయవద్దని పంజాబీలకు అన్యాయం జరుగుతోందని ఫవాద్ చెప్పుకొచ్చాడు. ఇలా పంజాబీల మనసుల్లో విషబీజాలు నాటాలని సైన్యాన్ని ఉద్దేశించి ఫవాద్ వ్యాఖ్యానించాడు.

అయితే  ఈ విషయం పై అమరీందర్ సింగ్ ఘాటుగా స్పందించారు. పాక్ మంత్రి తన పని తను చూసుకోవాలని ఆయన వ్యాఖ్యానించాడు. 'పంజాబీల్లో అలాంటి విషాన్ని పాక్ నింపలేదు భారత సైనికులు ఎంతో క్రమశిక్షణ కలిగిన వారు. పాక్ సైన్యంలా భారత సైన్యం ఎప్పుడూ అదుపుతప్పదు..' అని అమరీందర్ సింగ్ పాక్ మంత్రికి గట్టి జవాబు ఇచ్చారు.