స్పష్టత ఇచ్చిన భారత్: మధ్యవర్తిత్వంపై ట్రంప్ మాట్లాడలేదు

Fri May 29 2020 15:00:40 GMT+0530 (IST)

PM Modi not in good mood over border row with China

చైనా భారతదేశం మధ్య ఏర్పడిన వివాదాలకు తాము మధ్యవర్తిత్వం వహిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం భారత ప్రభుత్వం స్పందించింది. లదాఖ్ ప్రతిష్టంభనపై  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేసింది. మహమ్మారి వైరస్ చికిత్సకు మెరుగైన ఔషధంగా ట్రంప్ భావిస్తున్న యాంటి మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను పంపాలని కోరినపుడు మాత్రమే ప్రధాని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తో మాట్లాడారని వివరించింది. చైనాతో ఏర్పడిన వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తాను ఫోన్‌లో మాట్లాడానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదని స్పష్టం చేసింది.భారత్ చైనా సరిహద్దు వివాదంలో ఇరు దేశాలు అంగీకరిస్తే తాను మధ్యవర్తిత్వానికి సిద్ధమని ఈ విషయమై ప్రధానమంత్రి మోదీతో మాట్లాడినపుడు ఆయన మంచి మూడ్‌లో లేరని ట్రంప్ ప్రకటించారు. ఈ విషయమై ఓ ప్రకటనలో భారత ప్రభుత్వం  స్పందిస్తూ హైడ్రాక్సీక్లోరోక్విన్ అంశానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ మధ్య ఏప్రిల్ 4వ తేదీన చివరిసారి మాట్లాడారని గుర్తుచేసింది. మళ్లీ ఇప్పటివరకు ఇరు దేశాల నాయకుల మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదని స్పష్టం చేసింది.