Begin typing your search above and press return to search.

ప్రధాని సరికొత్త ఛాలెంజ్: దేశీయ యాప్స్ రూపొందిస్తే భారీ బహుమతులు

By:  Tupaki Desk   |   5 July 2020 9:40 AM GMT
ప్రధాని సరికొత్త ఛాలెంజ్: దేశీయ యాప్స్ రూపొందిస్తే భారీ బహుమతులు
X
చైనా ఉత్పత్తులు.. వస్తువులతో పాటు సేవలపై భారతదేశంలో స్థానం లేకుండా పోయే అవకాశం ఉంది. ఆ విధంగా భారత్ లో మార్పులు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే చైనాకు చెందిన 59 యాప్స్ ను భారత్ నిషేధించింది. దీంతోపాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకునేలా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భారత ప్రభుత్వం దేశీయ ఉత్పత్తులు.. వస్తువులు.. సేవలతో పాటు సాంకేతిక పరిజ్ఞానంలో కూడా దేశం పేరు నిలవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం ఔత్సాహికులకు.. సాఫ్ట్ వేర్ లకు.. కొత్త కొత్త ఆవిష్కరణలు చేసే వారికి ఆహ్వానం పలుకుతోంది.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త ఛాలెంజ్ విసిరారు. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా యాప్స్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ప్రకటించారు. దేశీయ యాప్స్ రూపొందించేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ఇదొక భాగం. ఔత్సాహికులు.. సృష్టికర్తలు.. పరిశోధకులు.. సాఫ్ట్ వేర్ రంగ నిపుణులు యాప్స్ రూపొందించాలని భారత ప్రభుత్వం పిలుపునిస్తోంది. ఈ సందర్భంగా రెండు దశల్లో పోటీలు నిర్వహిస్తోంది. భారత ఎలక్ట్రానిక్స్.. ఐటీ అటల్ ఇన్నోవేషన్ మిషన్ - నీతి ఆయోగ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. రెండు విభాగాలుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఎంట్రీలను జూలై 18వ తేదీ వరకు స్వీకరించనున్నారు.

అందులో మొదటి విభాగంలో కార్యాలయ వస్తువులు.. సేవలు.. సోషల్ మీడియా.. ఈ లెర్నింగ్.. వ్యవసాయం.. వినోదం.. ఫైనాన్షియల్ టెక్నాలజీ.. న్యూస్.. క్రీడా రంగాలు ఉంటాయి. వీటిలో ఆవిష్కరణలు చేసిన వారికి మూడు బహుమతులు ఇవ్వనున్నారు. మొదటి బహుమతి కింద రూ.20 లక్షలు.. రెండో బహుమతి రూ.15 లక్షలు.. మూడో బహుమతి రూ.10 లక్షలు ప్రకటించారు.

రెండో కేటగిరీ సబ్ కేటగిరీగా విభజించారు. అన్ని రంగాల్లో.. విభాగాల్లో యాప్స్ రూపొందించేలా ప్లాన్ వేశారు. ఈ విభాగంలో కూడా బహుమతులు ఉన్నాయి. మొదటి బహుమతి రూ.5 లక్షలు.. రెండో బహుమతి రూ.3 లక్షలు.. మూడో బహుమతి రూ.2 లక్షలు ఇవ్వనున్నారు. ఔత్సాహికులు త్వరపడండి.. దేశీయ యాప్స్ రూపొందించి లక్షలు సొంతం చేసుకోండి.