Begin typing your search above and press return to search.

ట్విట్టర్ ప్రకటించిన 2019 గోల్డెన్ ట్వీట్ ఎవరికి దక్కిందంటే?

By:  Tupaki Desk   |   10 Dec 2019 11:07 AM GMT
ట్విట్టర్ ప్రకటించిన 2019 గోల్డెన్ ట్వీట్ ఎవరికి దక్కిందంటే?
X
నిర్ణయం ఏదైనా మోడీ సర్కారు తీసుకుంటే చాలు.. దానికి ఆశేష భారతం మద్దతుగా నిలవటం తెలిసిందే. అమితమైన క్రేజ్ తో సాగుతున్న ప్రధానిగా ఆయనపై అభినందనల వర్షం కురుస్తోంది. ఓపక్క దేశంలో ఆర్థికపరమైన ఒడిదుడుకులతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. చివరకు.. ఆర్థికవేత్తలు సైతం ఈ ఫెయిల్యూర్ అంతా ప్రధాని మోడీదేనని చెబుతున్నా.. ప్రజల్లో ఆయనకున్న క్రేజ్ మాత్రం తగ్గట్లేదు.

అంతేకాదు సోషల్ మీడియాలో ఆయన చేసే ప్రతి ట్వీట్ ప్రజల గుండెల్లోకి దూసుకెళ్లిపోతోంది. దీనికి తగ్గట్లే ట్విట్టర్ వారు 2019 సంవత్సరానికి గాను గోల్డెన్ ట్వీట్ ను ఎంపిక చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ట్వీట్లు ఏడాదిలో పోస్టు అవుతున్నా.. గోల్డెన్ ట్వీట్ గా ఎంపికైనది ఎవరిదో తెలుసా? ప్రధాని మోడీ పోస్టు చేసిన ట్వీట్ ఆ ఘనతను సొంతం చేసుకుంది.

ట్విట్టర్ ఖాతాలో ఆయనకు 51 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా.. ట్విట్టర్ లో అత్యంత జనాదరణ పొందిన వ్యక్తిగా ఆయనో అపురూపమైన రికార్డును సొంతం చేసుకున్నారు. అంతేకాదు 2019 సాధారణ ఎన్నికల్లో అద్భుతమైన రీతిలో విజయాన్ని సాధించిన వేళ ఆయన చేసిన ట్వీట్ కు అరుదైన గుర్తింపు లభించింది.

సబ్ కా సాత్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్ = విజయి భారత్ అంటూ ట్విట్టర్ లో ఇచ్చిన నినాదం విశేష జనాదరణ పొందినట్లుగా ట్విట్టర్ వెల్లడించింది. ఈ ట్వీట్ ను భారత్ గోల్డెన్ ట్వీట్ ఆఫ్ 2019గా ఎంపిక చేశారు. ఇప్పటివరకూ ఈ ట్వీట్ ను 4.2లక్షల మంది లైక్ చేయగా.. 1,17లక్షల మంది రీట్వీట్ చేయటం గమనార్హం. ఎన్నికల ఫలితాలు వెల్లడవుతూ.. బీజేపీకి తిరుగులేని మెజార్టీతో దూసుకెళుతుందన్న వేళలో ఆయనీ ట్వీట్ చేశారు. మే 23 మధ్యాహ్నం 2.42 గంటల వేళలో పోస్టు చేసిన ఈ ట్వీట్ కు భారీ స్పందన లభించింది. ఇదే ట్వీట్ ను ట్విట్టర్ సైతం గోల్డెన్ ట్వీట్ ఆఫ్ 2019గా ఎంపిక చేయటం గమనార్హం.