Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ సీనియ‌ర్ల బ్ర‌హ్మాస్త్రం.. రేవంత్ కు పీసీసీ ఇస్తే అంతేన‌ట‌?

By:  Tupaki Desk   |   23 Jun 2021 2:30 PM GMT
కాంగ్రెస్‌ సీనియ‌ర్ల బ్ర‌హ్మాస్త్రం.. రేవంత్ కు పీసీసీ ఇస్తే అంతేన‌ట‌?
X
తెలంగాణ‌ కాంగ్రెస్ లో పీసీసీ చీఫ్ వ్య‌వ‌హారం ముదురు పాకాన ప‌డుతోందా? రేవంత్ వైపే అధిష్టానం మొగ్గుచూపుతోంద‌న్న ఫీల‌ర్ల న‌డుమ సీనియ‌ర్లు మ‌రింత గుర్రుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అవ‌స‌ర‌మైతే పార్టీలోంచి కూడా వెళ్లిపోయేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారా? అంటే.. అవును అనే స‌మాధాన‌మే ఇస్తున్నాయి తాజా ప‌రిణామాలు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఈ పీసీసీ ప‌గ్గాలను వ‌దిలేస్తున్నానంటూ ప్ర‌క‌టించారు ఉత్త‌మ్‌. నాటి నుంచి ఈ పోస్టును నింప‌డం ఢిల్లీ హైక‌మాండ్ కు స‌వాల్ మారింది. త‌మ‌కే ఇవ్వాల‌ని కొంద‌రు డిమాండ్లు వినిపిస్తుండ‌గా.. ప‌లానా వారికి మాత్రం ఇవ్వొద్ద‌ని పైర‌వీలు న‌డిపిస్తున్నారు మ‌రికొంద‌రు. పార్టీని బాగు చేసేవాళ్ల‌కే ఇవ్వాలంటున్నారు ఇంకొంద‌రు. ఈ విధంగా.. మూడు లేఖ‌లు, ఆరు అల‌క‌లు అన్న చందంగా త‌యారైంది ప‌రిస్థితి.

అయితే.. ఇన్నాళ్లూ వ్య‌తిరేక స్వ‌రం మాత్ర‌మే వినిపిస్తూ వ‌చ్చిన నేత‌లు ఇప్పుడు.. తాము ఆశించిన‌ట్టుగా జ‌ర‌గ‌క‌పోతే.. పార్టీలో నుంచి కూడా వెళ్లిపోతామ‌ని బెదిరిస్తున్నార‌ట‌. అది కూడా.. రేవంత్ కు పీసీసీ చీఫ్ ఇవ్వొద్ద‌నే డిమాండ్ మీద‌నేన‌ట‌! ఇత‌ర పార్టీ నుంచి వ‌చ్చి నేత చేతిలో గాంధీ భ‌వ‌న్ ను పెడితే.. కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతామ‌ని కూడా హింట్ ఇస్తున్నార‌ట‌.

ఇందులో సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి వంటివారు ఉన్నార‌ట‌. జ‌గ్గారెడ్డి ముందు నుంచీ రేవంత్ ను వ్య‌తిరేకిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌కు గ‌న‌క పీసీసీ ఇస్తే.. టీఆర్ఎస్ లోకి వెళ్తాన‌ని సూచ‌న‌లు ఇస్తున్నార‌నే చ‌ర్చ సాగుతోంది. ఇటీవ‌ల హ‌రీష్ ను శాలువాల‌తో స‌త్క‌రించ‌డం, పొగ‌డ్త‌ల్లో ముంచెత్త‌డాన్ని కీల‌క ప‌రిణామంగా చెబుతున్నారు. రాజ‌కీయంగా వీళ్లిద్ద‌రి మ‌ధ్య ఉన్న వైరం అంద‌రికీ తెలిసిందే. త‌న‌కు కేసీఆర్ ఒకేగానీ.. హ‌రీశ్ కాద‌ని గ‌తంలో బ‌హిరంగంగా స్టేట్ మెంట్ ఇచ్చారు జ‌గ్గారెడ్డి.

అలాంటి నేత ఇప్పుడు ఈ విధంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం రాజ‌కీవ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. దీని వెనుక కార‌ణం.. పీసీసీ చీఫ్ పంచాయితీనే అని అంటున్నారు. మొత్తానికి.. రేవంత్ ను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నార‌నే విష‌యం మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది. మ‌రి, అధిష్టానం ఏం చేస్తుంద‌న్న‌దే కీల‌కం. సీనియ‌ర్ల డిమాండ్ల‌కు త‌లొగ్గుతుందా? పార్టీ భవిష్యతే ముఖ్యమని నిర్ణయం తీసుకుంటుందా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.