భారత్ లో కరోనా బీభత్సం .. 510 కోట్ల విరాళం ప్రకటించిన ఫైజర్

Tue May 04 2021 12:02:41 GMT+0530 (IST)

P Fizer Company Donated 510 Crores

కరోనా తో భారత్ మొత్తం బిక్కుబిక్కుమంటుంది. ఈ సమయంలో  భారత్ ను ఆదుకునేందుకు అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ ముందుకొచ్చింది. దాదాపు 510 కోట్ల రూపాయల విలువైన మందులను భారత్ కు విరాళంగా ప్రకటించింది. కరోనా చికిత్సకు అవసరమైన మందులను ఫైజర్ భారత్ కు ఉచితంగా పంపనుంది.  ఇక ఫైజర్ సంస్థ చరిత్రలోనే ఇది అతి పెద్ద విరాళం కావడం విశేషం. అమెరికాతో పాటు యూరప్ ఆసియాలలోని తమ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఈ మందులను ఇండియాకు పంపనున్నట్లు ఫైజర్ చైర్మన్ ఆల్బర్ట్ బౌర్లా వెల్లడించారు.ఇండియాలో కరోనా పరిస్థితులు మమ్మల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు ఆల్బర్ట్. ఇండియాలో ప్రజల కోసం మేము ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ పోరాటంలో ఇండియాతో కలిసి సాగుతాం.. కంపెనీ చరిత్రలో అతిపెద్దదైన సాయం చేసే దిశగా చాలా వేగంగా పని చేస్తున్నామని ఆయన చెప్పారు. భారత ప్రభుత్వం కరోనా చికిత్స కోసం అనుమతించిన మందులను ఫైజర్ ఇండియాకు పంపే ఏర్పాట్లు చేస్తోంది. రోనా కష్ట కాలంలో భారత్ ను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చిన సమయంలో ఫైజర్ సాయం చేయడం భారత్ కు కాస్త ఊరటనివ్వనుంది.దేశంలోని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్ పేషెంట్ కు తమ ఫైజర్ మందులు ఉచితంగా అందాలన్న ఉద్దేశంతోనే తాము ఈ పని చేస్తున్నట్లు ఆల్బర్ట్ తెలిపారు.  మరోవైపు.. భారత్ లో తమ కంపెనీ వ్యాక్సిన్ల అనుమతి కోసం కేంద్రంతో చర్చిస్తున్నట్లు ఫైజర్ తెలిపింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండానే టీకాను భారత ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని గత నెలలోనే ప్రకటించింది ఫైజర్. ఈ విషయంపై భారత ప్రభుత్వంతో చాలా సార్లు సంప్రదింపులు కూడా జరిపింది. అటు కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా ఇతర దేశాలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ను అనుమతిస్తామని ఇదివరకే వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం.