Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే రోజా అడ్డాలో ‘పరిషత్’ పంచాయితీ.. సొంత పార్టీ నేతల మధ్య రచ్చరచ్చ

By:  Tupaki Desk   |   26 Sep 2021 3:43 AM GMT
ఎమ్మెల్యే రోజా అడ్డాలో ‘పరిషత్’ పంచాయితీ.. సొంత పార్టీ నేతల మధ్య రచ్చరచ్చ
X
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎంతటి ఫైర్ బ్రాండో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ ప్రభుత్వంలో ఆమెకు కీలక మంత్రి పదవి దక్కుతుందన్న ప్రచారం భారీగా జరిగినా.. ఆమెకునామినేటెడ్ పదవి తప్ప మరేమీ దక్కలేదు. ఈ మధ్యన ఆ పదవి నుంచి తప్పించారు. అయినప్పటికీ రోజా మాత్రం దీనిపై పెదవి విప్పలేదు. ఏం జరిగినా అది తన మంచి కోసమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నఆమె.. త్వరలో జరిగే విస్తరణలో తనకు గుర్తింపు లభిస్తుందని.. తనకు తగ్గ పదవిని పార్టీ అధినేత ఇవ్వటం ఖాయమన్న నమ్మకంతో ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన మాటలతో చేతలతో ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపించే ఫైర్ బ్రాండ్ కు సొంత పార్టీకి చెందిన ఆమె ప్రత్యర్థులు ఆమెకు సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గ పరిధిలోని విషయాల్లో ఆమె మాట సాగనివ్వకుండా చేయటమే కాదు.. ఆమె తీసుకునే నిర్ణయాలను బాహాటంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో.. వ్యవహారం రచ్చ రచ్చగా మారుతోంది. తాజాగా జరిగిన ఎంపీపీ ఎన్నిక దీనికి నిదర్శనంగా చెప్పాలి. ఈ మధ్య జరిగిన పంచాయితీ..కార్పొరేషన్ ఎన్నికల్లో రోజాను ఒంటరిని చేయాలన్న లక్ష్యంతో ఆ ఎన్నికల్లో రెబల్అభ్యర్థుల్ని బరిలోకి దింపారు సొంత పార్టీకి చెందిన ప్రత్యర్థులు. అయితే.. వారు విసిరిన సవాళ్లను సమర్థంగా తిప్పికొట్టిన ఆమె.. తాను ఎంపిక చేసిన అభ్యర్థుల్ని గెలిపించుకోవటం ద్వారా రాజకీయ ఎత్తులు వేయటంలో తనకున్న సమర్థత ఎంతన్న విషయాన్ని తెలియజేశారు.

తాజాగా విడుదలైన పరిషత్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ విజయ ఢంకా మోగించింది. అందుకు తగ్గట్లే చిత్తూరు జిల్లాలోనూ వైసీపీ హవా నడిచింది. రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిలోనూ అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. అయితే.. మంత్రి పెద్దారెడ్డికి అనుచరుడిగా ఉన్న చక్రపాణి రెడ్డి ఆర్కే రోజాకు కొత్త సమస్యల్ని తెచ్చి పెడుతున్నారన్న టాక్ నడుస్తోంది. నగరిలోని నిండ్ర మండలంలో చక్రపాణి రెడ్డిదే హవా. దీంతో.. రోజా వర్గానికి పదవి దక్కుండా ఆయన పావులు కదపటమే కాదు.. రోజా నిర్ణయించిన అభ్యర్థి ఎంపిక కాకుండా అడ్డుకొన్నారు. ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది.

నగరిలో పార్టీలో నెలకొన్న గ్రూపుల రచ్చ ఇప్పటికే పలుమార్లు తెర మీదకు వచ్చినా.. పార్టీ అధినాయకత్వం వీటికి బ్రేకులు వేసేలా వ్యవహరించలేదన్న విమర్శ వినిపిస్తోంది. తాజాగా ఎంపీపీ ఎన్నిక సందర్భంగా అదే జరిగిందని చెబుతున్నారు. నగరి నియోజకవర్గంలో నెలకొన్న అధిపత్య పోరు తాజా పరిణామాలతో పీక్స్ కు చేరిందని చెప్పాలి. తరతరాలుగా వస్తున్న తీరుకు రోజా చెక్ చెప్పటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

విజయాపురం ఎంపీపీగా రాజుల వర్గానికి చెందిన వారికి కేటాయిస్తుంటారు. దీనికి తగ్గట్లు రాజుల వర్గానికి చెందిన లక్ష్మీపతి రాజును అభ్యర్థిగా భావిస్తే.. ఆర్కే రోజా మాత్రం ఒక దళిత మహిళను ఎంపీపీ చేయాలనిడిసైడ్ అయ్యారు. అందుకు తగ్గట్లే.. తాను అనుకున్న వారిని ఎంపీపీగా ఎన్నికయ్యేలా చేసి సత్తా చాటారు. ఇదే ఊపు మీద నిండ్రలోనూ అలాంటి వ్యూహానికే తెర తీశారు రోజా. అయితే.. ఆమెకు ఊహించని రీతిలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావటం.. సొంత పార్టీ నేతలు.. ఏం చేస్తావో చేయ్.. పార్టీ నుంచి సస్పెండ్ చేయిస్తావా? అన్న స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది.

నిండ్రలో ఎంపీపీ అభ్యర్థిగా ఆర్కే రోజా ఎంపిక చేసిన నేత దీపా కాగా.. ప్రస్తుతం శ్రీశైలం బోర్డు ఛైర్మన్ గా ఉన్న చక్రపాణి రెడ్డి తమ్ముడు భాస్కర్ రెడ్డిని ఎంపీపీగా చేయాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో.. ఇద్దరి నేతల మధ్య అధిపత్య పోరుతో పార్టీలో చీలిక స్పష్టమైంది. దీంతో తనకున్న ఐదుగురు ఎంపీటీసీలతో గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రోజా రంగంలోకి దిగి కోఆప్షన్ మెంబర్ గా అనిల్ కుమార్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగటం.. ఆర్కే రోజాకు తగినంత మంది ఎంపీటీసీలు చేతులో లేకపోవటంతో.. చివరకు ఎన్నిక కాస్తా వాయిదా పడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజాకు.. సొంత పార్టీకే చెందిన అసమ్మతి నేతలకు మధ్య జరిగిన మాటల యుద్ధం రచ్చ రచ్చగా మారింది. సవాళ్లు.. ప్రతిసవాళ్లతో హోరెత్తింది. ఇంత జరుగుుతున్నా.. పార్టీ అధినాయకత్వం కలుగజేసుకొని ఈ తీరుకు ఎందుకు చెక్ చెప్పటం లేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.