Begin typing your search above and press return to search.

కేంద్ర ర్యాంకింగ్ లో అదరగొట్టేసిన ఏపీ

By:  Tupaki Desk   |   7 March 2021 4:23 AM GMT
కేంద్ర ర్యాంకింగ్ లో అదరగొట్టేసిన ఏపీ
X
దేశ వ్యాప్తంగా కేంద్రం చేపట్టిన స్వచ్ఛభారత్-2లో భాగంగా ఓడీఎఫ్ ప్లస్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచి అదరగొట్టేసింది. గ్రామాలను పూర్తి పరిశుభ్రంగా ఉంచటం.. రోడ్లపై మురుగునీరు నిలవకుండా ఉండటం.. చెత్త చెదారం లేకుండా చూడటం.. గ్రామస్తులంతా వందశాతం మరుగుదొడ్లు వినియోగించటం లాంటి ఎనిమిది అంశాల ప్రాతిపదికన కేంద్రం చేపట్టిన కార్యక్రమాల్లో మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీ ముందుంది.

కేంద్రం పేర్కొన్న మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీలోని 680 పల్లెల్ని గుర్తించారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి గ్రామాలు 1060 గుర్తిస్తే.. అందులో సగానికిపైనే ఏపీలోనే ఉండటం విశేషం. ఈ ర్యాంకింగ్ లో హర్యాణ రెండో స్థానంలో నిలిచింది. అక్కడ 199 గ్రామాల్ని ఇదే తరహాలో ఉన్నట్లు గుర్తించారు. మూడో స్థానంలో ఛత్తీస్ గఢ్ నిలిచింది. ఇక.. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కేవలం ఈ తరహాలో ఉన్నవి కేవలం 22 గ్రామాల్ని మాత్రమే గుర్తించారు.

దారుణమైన విషయం ఏమంటే.. కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి దేశం మొత్తమ్మీదా 35 రాష్ట్రాలు ఉంటే.. 24 రాష్ట్రాల్లో ఈ తరహాలో ఒక్కటంటే ఒక్క గ్రామం లేకపోవటం గమనార్హం. దేశ వ్యాప్తంగా 6.03 లక్షల గ్రామాల్ని 2025 మార్చి చివరకు పూర్తి పరిశుభ్రత గ్రామాలుగా తీర్చి దిద్దేందుకు కేంద్రం స్వచ్ఛ భారత్ 2 ప్రోగ్రాంను ఓడీఎఫ్ ప్లస్ పేరుతో శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఎనిమిది అంశాల్ని పేర్కొంది.

ఇప్పటికే దేశంలో మొదటిస్థానంలో ఉన్న ఏపీ.. మరింత మెరుగుదల కోసం భారీ కార్యక్రమాన్నే చేపట్టింది. మనం - మన పరిశుభ్రత పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఏపీ వ్యాప్తంగా మొత్తం18,841 గ్రామాలు ఉన్నాయి. వీటన్నింటిని కేంద్రం పేర్కొన్న ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా మార్చేందుకు వీలుగా.. 2020 జూన్ ఒకటి నుంచి ఏపీలోని 1320 గ్రామ పంచాయితీల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రెండో విడతలో భాగంగా 4737 గ్రామ పంచాయితీలో గత ఏడాది డిసెంబరులో షురూ చేశారు. ఏమైనా.. దేశంలోని 24 రాష్ట్రాల్లోని ఒక్క గ్రామం సాధించలేనిది.. ఏపీలో ఏకంగా 680 గ్రామాలు ఎంపిక కావటం వావ్ అనకుండా ఉండలేం.