Begin typing your search above and press return to search.

సైలెంట్ గా ఉన్నోళ్ల చేతికి జుట్టు ఇచ్చుడా కేసీఆర్?

By:  Tupaki Desk   |   11 July 2020 11:30 PM GMT
సైలెంట్ గా ఉన్నోళ్ల చేతికి జుట్టు ఇచ్చుడా కేసీఆర్?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పాదరసం లాంటోడంటూ ఆయన ప్రత్యర్థులు తరచూ వ్యాఖ్యానిస్తుంటారు. ఛాన్సు ఇవ్వటానికి ఏ మాత్రం ఇష్టపడని తత్త్వం ఆయన సొంతంగా చెబుతుంటారు. నోరు జారితే మిగిలిన వారి మాదిరి సాగదీయకుండా మాటను వెనక్కి తీసుకోవటం.. అవసరమైతే అన్నా అనేయటం.. పట్టు చిక్కినంతనే పెద్ద మనిషిగా ఇచ్చిన మర్యాదను నిలుపుకోవా? అంటూ చెలరేగిపోవటం ఆయనకు మాత్రమే చెల్లుగా చెబుతారు. వ్యూహాత్మకంగా వ్యవహరించే విషయంలో ఆయన్ను కొట్టేవాడు ఇప్పటికైతే తెలంగాణలో లేరన్న మాట పలువురు నేతలు తరచూ ప్రస్తావిస్తుంటారు.

ఎప్పుడు ఏ విషయాన్ని తెర మీదకు తీసుకురావాలో.. దానికి తగ్గట్లు ప్రజల్ని ట్యూన్ చేయాలన్న విషయం మీద కేసీఆర్ కున్న సమ్మోహనశక్తి మరెవరికీ లేదు. చంద్రబాబు చేసిన తప్పుల్ని ఎప్పటికి మర్చిపోలేని రీతిలో అదే పనిగా గుర్తుకు తెచ్చుకొని పళ్లు నూరటం కేసీఆర్ విషయంలో కనిపించదు. ఆ విషయంలో సారు అదృష్టం అంతా ఇంతా కాదు.

అన్ని రోజులు ఒకేలా ఉండవని ఊరికే అనరేమో? సాధారణంగా రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయన్న నానుడి తరచూ వినిపిస్తూ ఉంటుంది. తన వ్యూహంతో ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టే కేసీఆర్.. అందుకు భిన్నంగా తనకు తానే సెల్ఫ్ గోల్ చేసుకోవటం ఆసక్తికరంగా మారింది. మరింత వివరంగా చెప్పాలంటే.. కేసీఆర్ సర్కారు చేసిన తప్పును విపక్షాలు గుర్తించి.. గొంతులు సవరించుకునే లోపే.. బాధ ప్లస్ వేదనతో కూడిన ప్రెస్ నోట్ చర్చనీయాంశంగా మారింది.

సచివాలయాన్ని కూల్చి వేసే అంశానికి సంబంధించి చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీని ఫాంహౌస్ కు పిలిపించుకొని మరీ గంటల తరబడి చర్చలు జరిపిన ఆయన.. ఏం చేయాలన్న విషయానికి సంబంధించిన రోడ్ మ్యాప్ ను సిద్ధం చేశారనే చెప్పాలి. సచివాలయం కూల్చివేత సమయంలో.. ప్రత్యేకంగా పూజలు జరిపించటం.. ముస్లిం మతపెద్దల్ని పిలిపించి.. వారికి గ్రంధాలు ఇవ్వటం లాంటివి అధికారులు చేసినట్లుగా కొన్నిప్రముఖ మీడియా సంస్థలో రిపోర్టు అయ్యాయి. ఒకవేళ అది తప్పైతే.. వెంటనే ప్రభుత్వం ఖండించేది. కానీ.. ఆ విషయంలో అలా జరగలేదు.

కానీ.. కూల్చివేత షురూ చేసిన మూడు.. నాలుగు రోజులకు అకస్మాత్తుగా విడుదలైన ప్రెస్ నోట్ లో.. గుడి.. మసీదు విషయంలో జరిగిన దానికి తాను చాలా వేదనకు గురైనట్లుగా కేసీఆర్ చెప్పుకున్నారు. పాత వాటి స్థానంలో రెండింటిని మరింత పెద్దవిగా నిర్మిస్తామన్న హామీ ముఖ్యమంత్రి నుంచి రావటం ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకిలా అన్నది ప్రశ్నగా మారింది. సీఎం కేసీఆర్ ఏ పని ఉత్తినే చేయరన్నది మర్చిపోకూదు.

ఏదో జరిగితేనే తప్పించి ఈ తీరులో ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేయటం ఉండదు. సీఎం ప్రెస్ నోట్ రిలీజ్ అయిన కాసేపటికే ప్రతిపక్షాలు గొంతు విప్పటం షురూ చేశాయి. ముప్పేట దాడి మొదలెట్టాయి. ఇదంతా చూసినప్పుడు.. సీఎం నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ కాకుండా ఉంటే.. ఇష్యూ అక్కడితో ఆగేదన్న భావన కలుగక మానదు. తనకు నచ్చని విషయంలో ఎంత కిందామీదా పడినా.. స్పందించని గుణం కేసీఆర్ లో ఎక్కువే. అలాంటి ఆయన.. తనకు తానుగా విడుదల చేసిన నోట్ ఇప్పుడు రాజకీయ దుమారంగా మారింది.

ముఖ్యమంత్రే స్వయంగా డిఫెన్సులో పడినట్లుగా నోట్ ఉన్న వేళ.. విపక్షాలు పట్టు బిగించే ప్రయత్నాలు మొదలెట్టాయి. బలవంతుడి బలహీనత బయటపడినప్పుడు ఏ ప్రత్యర్థి మాత్రం వదిలిపెడతారు చెప్పండి? అదే సమయంలో.. ఎవరికి అవకాశం ఇవ్వని కేసీఆర్..తాజా ఉదంతంలో మాత్రం తన తీరుకు భిన్నంగా విపక్షాలకు తన జుట్టును పట్టుకునే అవకాశం ఎలా ఇచ్చారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు. ఏమైనా తాజా ఎపిసోడ్ మాత్రం సారు లాంటి వారు సైతం తప్పులు చేస్తారన్న వాదనకు బలాన్ని ఇచ్చిందని చెప్పాలి.