Begin typing your search above and press return to search.

త‌న వాడికే రాజ్య‌స‌భ సీటు!

By:  Tupaki Desk   |   5 Dec 2021 10:30 AM GMT
త‌న వాడికే రాజ్య‌స‌భ సీటు!
X
బండ ప్ర‌కాష్ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్య‌స‌భ ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎవ‌రిని ఎంపిక చేస్తారో అన్న ఆసక్తి నెల‌కొంది. ఆ ప‌ద‌వి ఎవ‌రికి ద‌క్కుతోందోన‌న్న చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. రేసులో మూణ్నాలుగు పేర్లు వినిపిస్తున్నాయి. కానీ విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం త‌న కుటుంబానికే చెందిన ఓ వ్య‌క్తికి కేసీఆర్ ఆ ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌బోతున్నార‌ని స‌మాచారం. న‌మ‌స్తే తెలంగాణ ఎండీ దామోద‌ర్ రావును కేసీఆర్ ఖ‌రారు చేశార‌ని అంటున్నారు.

త‌న‌య‌ను అనుకున్నా..
తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల న‌గారా మోగ‌డంతో రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యేల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థాన‌ల ఎంపిక పూర్త‌యింది. అందులో ఒక స్థానాన్ని రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న బండ ప్ర‌కాష్‌కు క‌ట్ట‌బెట్టారు. దీంతో ఆయ‌న త‌న రాజ్య‌స‌భ స్థానానికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. ఈట‌ల రాజేంద‌ర్ వెళ్లిపోవ‌డంతో ఖాళీ అయిన స్థానాన్ని అదే సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడితో భ‌ర్తీ చేయాల‌ని ప్ర‌కాశ్‌ను ఎమ్మెల్సీని చేశారు. ఆయ‌న్ని మంత్రివ‌ర్గంలోకి తీసుకునే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఖాళీ అయిన రాజ్య‌స‌భ సీటుకు కేసీఆర్ త‌న‌య క‌విత‌ను పంపిస్తారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ రాష్ట్ర రాజ‌కీయాల‌పైనే ఆస‌క్తి చూపించిన ఆమె మ‌రోసారి స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ అయ్యారు.

వాళ్ల పేర్లు..
క‌విత రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు ఆస‌క్తి చూక‌పోవ‌డంతో ఇక ఇత‌ర నాయ‌కుల పేర్ల‌పై కేసీఆర్ దృష్టి సారించారు. మిగిలిన మూడేళ్ల ప‌ద‌వి కాలం కోసం ఎవ‌రిని ఎంపిక చేయాల‌నే ఆలోచ‌న చేస్తున్నారు. అందులో భాగంగా తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు, పొంగులేటి సుధాక‌ర్‌రెడ్డి, రాష్ట్ర ప్ర‌ణాళిక సంఘం వైస్ ఛైర్మ‌న్ బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్ లాంటి సీనియ‌ర్ నాయ‌కుల పేర్లు వినిపించాయి. కానీ ఆయ‌న త‌న బంధువుకే ఆ ప‌ద‌వి ఇవ్వాల‌ని అనుకుంటున్నార‌నే ప్ర‌చారం ఇప్పుడు జోరందుకుంది. అందుకే దామోద‌ర్ రావు పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. గ‌తేడాదే ఆయ‌న్ని రాజ్య‌స‌భ‌కు పంపిస్తాన‌ని కేసీఆర్ హామీ ఇచ్చిన‌ప్ప‌టికీ రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో అది సాధ్యం కాలేద‌ని తెలిసింది. కానీ ఇప్పుడు ఆయ‌న‌కు ఆ ప‌ద‌వి ప‌క్కా అని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఆ విమ‌ర్శ‌లు..
ఇప్ప‌టికే రాష్ట్రంలో కుటుంబ పాల‌న సాగుతుంద‌ని కేసీఆర్‌పై విప‌క్షాలు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. కొడుకు కేటీఆర్‌, మేన‌ళ్లుడు హ‌రీష్ రావు మంత్రులుగా, త‌న‌య క‌విత గ‌తంలో ఎంపీగా, ఇప్పుడు ఎమ్మెల్సీగా, మ‌రో బంధువు సంతోష్ రావు ఇప్ప‌టికే రాజ్య స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. దీంతో రాష్ట్రంలోని ప్ర‌త్య‌ర్థి పార్టీలు కేసీఆర్‌పై మాట‌ల యుద్ధం చేస్తున్నాయి. నిరుద్యోగ స‌మ‌స్య ప‌రిష్క‌రించ‌లేని కేసీఆర్‌.. త‌న కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగులు ఇచ్చుకుంటున్నార‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు దామోద‌ర్ రావు రాజ్య‌స‌భ ఎంపీ అయితే ఆ విమ‌ర్శ‌లు మ‌రింత ఘాటెక్క‌డం ఖాయం.