లైట్ తీస్కో : ఉప ఎన్నిక రిజల్ట్ ఉఫ్ అని ఊదేశారు...

Mon Jun 27 2022 21:00:01 GMT+0530 (IST)

Opposition Parties In Andhrapradesh

మూడేళ్ళ పాలన తరువాత వచ్చిన ఒక ఉప ఎన్నిక. ఇక భారీ మెజారిటీతో ఫలితం వచ్చింది. అఫ్ కోర్స్ అధికార వైసీపీ అనుకున్న లక్ష మెజారిటీ రాకపోవచ్చు. దానికి దరిదాపుల్లో వచ్చిన మెజారిటీగా 83 వేలను చూస్తున్నారు. పోలింగ్ శాతం తగ్గినా పోలైన ఓట్లలో మూడొంతులు వైసీపీ ఖాతాలోనే పడినా కూడా ఆ విజయం మీద ఏపీ రాజకీయం  తలచడమే లేదు. అసలు ఉప ఎన్నిక జరగలేదు అన్నట్లుగానే ఉండిపోయింది.నిజానికి ఆత్మకూరు అనే కాదు బద్వేల్  ఉప ఎన్నిక నుంచే  విపక్షాలు రూట్ మార్చాయి. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఫలితం చూసిన తరువాత ఇక నేరుగా సార్వత్రిక ఎన్నికలలోనే  ఢీ కొట్టాలి తప్ప మధ్యలో ఎన్నికల పోరు అసలు వద్దు అని డిసైడ్ అయినట్లుగా ఉన్నారు. అందుకే బద్వేల్ బరిలో టీడీపీ జనసేన నిలబడలేదు ఆత్మకూరు లో అదే సీన్ రిపీట్ అయింది. అలా వైసీపీ ఏకపక్ష విజయాలను ఏ మాత్రం పట్టించుకోకూడదని భారీ స్ట్రాటజీకి తెర తీశారు అనుకోవాలి.

ఇవన్నీ పక్కన పెడితే  ఒక వైపు ఆత్మకూరు ఉప ఎన్నిక కౌంటింగ్ జరిగి ఫలితాలు వచ్చాయి. అదే టైమ్ లో గుంటూరులో మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు బిగ్ సౌండ్ చేశారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో 160 సీట్లను తెలుగుదేశం గెలుచుకుంటుంది. అది కూడా ఎవరితో అసలు పొత్తులే లేకుండా అని ఆయన ఢంకా భజాయించిన తీరుతో ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితం ఉఫ్ అని ఊదేసినట్లు అయింది.

సరిగా అదే రోజు క్రిష్ణా జిల్లాలో టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు ఒక చోట జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ రెండేళ్ళలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని బల్లగుద్ది మరీ చెప్పారు. రాఘవేంద్రరావు టీడీపీ సానుభూతిపరుడు. ఆయన కూడా ఆత్మకూరు ఫలితాన్ని అసలు ఖాతరు చేయలేదు అనుకోవాలి.

సరే విపక్షాలు లైట్ తీసుకుంటాయి కాబట్టి మాట్లాడలేదు అనుకుంటే అధికార వైసీపీలో అయినా జోష్ ఉందా అంటే లేదు అనే అనుకోవాలి. జగన్ ట్వీట్ చేస్తూ ఆత్మకూరు ఫలితం ఆందనాన్ని ఇచ్చిందని అనేసి ఊరుకున్నారు. పార్టీపరంగా నాయకులు ఎవరూ పెద్దగా హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన పరిస్థితి లేనే లేదు అంటే ఆత్మకూరు ఉప ఎన్నిక వైసీపీకి కూడా కిక్ ఇచ్చినట్లుగా లేదు అనుకోవాలి.

లేదా వరస విజయాలు వెగటు పుట్టించాయని కూడా భావించాలి. అంతే కాదు ఉప ఎన్నికలు ఇలాగే ఉంటాయి అసలు ఎన్నికలే అగ్ని పరీక్ష అని కూడా నిర్ధారణకు వచ్చి ఉండాలి. నిజానికి గతంలో అయితే వైసీపీ నేతలు సంబరాలు చేసుకునేవరే. కానీ గత రెండు నెలలుగా వారు గడప గడపనూ టచ్ చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ లో తిరుగుతున్నారు. దాంతో వాస్తవాలు  వారికి అర్ధమవుతున్నాయి

తమ రాజకీయం గురించి ఏ సర్వే చెప్పకపొయినా  బాగానే అర్ధమవుతుంది అనుకోవాలి. అందుకే ఆత్మకూరు విజయానందం అయితే ఎక్కడా లేదు నిజానికి ఉప ఎన్నికలు వేరు అసలు ఎన్నికలు వేరు. ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవాలి. 2017లో కర్నూల్ జిల్లాలోని నంద్యాల ఉప ఎన్నిక జరిగితే టీడీపీ దాదాపుగా ముప్పయి వేల వేళ తేడాతో గెలిచింది. ఆ తరువాత రెండేళ్ళకే భారీ ఓటమిని మూటకట్టుకుంది. అందువల్ల ఉప ఎన్నికలు ఎపుడూ కొలమానం కాదు అనే నిర్ధారణకు అంతా వచ్చేశారు.

ఇక ఏపీలో వైసీపీకి భారీ వ్యతిరేకత ఉందని టీడీపీ భావిస్తోంది. మాకు వ్యతిరేకత లేదు అని వైసీపీ ఆత్మకూరు ఉప పోరు ద్వారా చెప్పాలని ప్రయత్నం చేసింది. అది కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు అన్న విశ్లేషణలు ఉన్నాయి. దాదాపుగా ఎనభై వేల మంది దాకా ఓటర్లు పోలింగ్ బూతులకు రాకపోవడమే వైసీపీ మీద అసలైన వ్యతిరేకతకు సాక్ష్యమని అంటున్నారు. మొత్తానికి మరో రెండేళ్ళలో జరిగే సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో దగ్గరలో ఏ ఎన్నిక అయితే లేదు. దాంతో 2024 ఫలితాలు ఎలా ఉంటాయి అన్న ఉత్కంఠ అయితే అలాగే ఉంది మరి.