20 రోజులు.. 5 లేఖాస్త్రాలు.. సోము రాజకీయం ఇదేనా?

Thu Sep 16 2021 16:00:01 GMT+0530 (IST)

Opposition Leaders letters to the ruling party governments

ప్రతిపక్షంలో ఉన్న నాయకులు.. అధికార పక్షానికి ప్రభుత్వానికి లేఖలు రాయడం.. అనేది ఇటీవల కాలంలో మనకు కనిపించదు. సోషల్ మీడియా మాధ్యమాలు పెరిగిపోవడం.. ఉద్యమాలకు ప్రాధాన్యం ఉండడంతో లేఖలను చదివే తీరిక.. వాటికి స్పందించే ఓపిక కూడా సన్నగిల్లింది. దీంతో నాయకులు హాట్ కామెంట్లతో రాజకీయాలను వేడెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. దీనికి భిన్నంగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ సీఎం జగన్‌కు లేఖాస్త్రాలు సంధిస్తూ.. రికార్డు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.వాస్తవానికి గతంలో బీజేపీ నాయకుడు ప్రస్తుత గవర్నర్ దత్తత్రేయ.. కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వానికి నిత్యం లేఖలు రాసేవారు. ఆయన రాసిన లేఖలను ప్రభుత్వం పట్టించుకునేదో లేదో తెలియదు కానీ... ఆయన మాత్రం లేఖల వీరుడిగా అప్పట్లో గుర్తింపు పొందారు. అంతేకాదు.. ఆయా లేఖలను గుదిగుచ్చి.. ఓ పుస్తకం కూడా వేయించుకుని రాజకీయంగా సంచలనం సృష్టించారు.

ఇక ఇటీవల కాలంలో కొన్ని రోజులు.. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఏపీ సీఎం జగన్‌కు డీజీపీకి లేఖలు సంధిస్తున్న విషయం తెలిసింది. ఈ క్రమంలో ఇప్పుడు సోము వీర్రాజు కూడా జతయ్యారని అంటున్నారు పరిశీలకులు. గడిచిన 20 రోజుల్లో సోము వీర్రాజు మొత్తం 5 లేఖలు రాశారు. వివిధ అంశాలను ఆయన ప్రస్తావిస్తూ.. సీఎం జగన్ కు ఈ లేఖలను సంధించడం గమనార్హం. ఆయన ఉద్దేశంతో మీడియా ప్రటనలు ఇచ్చేకన్నా.. ఇలా లెటర్లు రాయడమే బెటర్ అనుకుని ఉండొచ్చు.

లేఖ 1: ఏపీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాలపై సోము స్పందించారు.
లేఖ 2: కంట్రిబ్యూటరీ పింఛన్ స్కీంపై ప్రశ్నలు సంధించారు.
లేఖ 3: వినాయచవితి వేడుకలపై.. ప్రభుత్వం విధించిన ఆంక్షలను ప్రశ్నించారు.
లేఖ 4: పలువురు రాజకీయ నేతలపై కేసులను ఎత్తివేయడంపై ప్రశ్నలు సంధించారు.
లేఖ 5: మత్య్సకారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ.. లేఖ రాశారు.

ప్రస్తుత పరిస్థితిలో అటు సోము ఇటు బీజేపీ నేతలు కూడా ఈ లేఖాస్త్రాలు తమకు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. తమ లేఖఖలకు ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని.. సమస్యలను పరిష్కరిస్తున్నట్టు కూడా పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో రోడ్డెక్కి.. ప్రభుత్వాన్ని విమర్శించడం కన్నా.. ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శించేందుకు లేఖలు దోహదపడతాయనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇటీవల కాలంలో బీజేపీ నేతలు పలు అంశాలపై రోడ్డెక్కిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఆయా విషయాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తమ విజయమేనని చెప్పుకొచ్చారు.

ఇక ఇప్పుడు లేఖల ద్వారా కూడా ఎంతో కొంత స్పందన వస్తే.. బీజేపీ విజయమని ప్రచారం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే.. సోము రాసిన లేఖలపై ప్రభుత్వం నుంచి అంతో ఇంతో స్పందన కనిపిస్తోంది. దీంతో మరిన్ని లేఖలు సంధించేందుకు సోము ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు విషయానికి వస్తే.. అటు డీజీపీ కానీ ఇటు ప్రభుత్వం కానీ ఎక్కడా స్పందించకపోవడం గమనార్హం. అయితే.. దీనికి ప్రధాన కారణం.. బీజేపీ బలంగా లేకపోవడమేనని చెబుతున్నారు. బలంగా లేని పార్టీకి స్పందించినా.. నష్టం లేదని.. వైసీపీ భావిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు.