Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ గేమ్ .. రూ.5.40 లక్షలు ఫట్ !

By:  Tupaki Desk   |   13 July 2020 7:30 AM GMT
ఆన్ లైన్ గేమ్ .. రూ.5.40 లక్షలు ఫట్ !
X
ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ మోసాలు ఎక్కువైపోయాయి. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా కూడా లక్షల్లో సొమ్ము కాజేస్తున్నారు. పోలీసులు , ప్రభుత్వం ఈ సైబర్ నేరాలపై ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇలా మోసపోయేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. మొబైల్ లో ఆన్ ‌లైన్ లో ‌ గేమ్‌ పేరుతో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలుడు రూ.5 లక్షలు పోగొట్టిన సంఘటన తెలిసిందే. ఈ ఘటన తో ఆ కుటుంబం కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయింది. ఎంతోకష్ట పడి కుటుంబ పోషణ కోసం తిని, తినక దాచిపెట్టుకున్న డబ్బు దోపిడీకి గురైంది. దీనితో ఇప్పుడు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో.. ఈ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో అర్థం కాక ఆ బాలుడి తల్లి గుండెలు పగిలేలా రోదిస్తుంది. అమలాపురం పట్టణ పోలీసులకు బాలుడి తల్లి చెప్పిన వివరాలతో ఈ ఆన్‌ లైన్‌ గేమ్‌ మోసంలో మరిన్ని కొత్త కోణాలు వెలుగు చూశాయి. ఆ బాలుడు తన తల్లి స్మార్ట్‌ ఫోన్‌ తో ఆన్ ‌లైన్‌ క్లాసులు వింటూనే మరోవైపుకి ఖాళీ సమయాల్లో సరదాగా ఆన్‌ లైన్‌ గేమ్ ఆడేవాడు.

ఆలా గత 20 రోజులుగా ఆ ఆన్లైన్ గేమ్‌ లు ఆడుతున్నాడు. ఫ్రీ ఫైర్‌ అనే ఆన్‌ లైన్‌ గేమ్‌ యాప్‌ ను ఓపెన్‌ చేశాడు. అందులో వెపన్స్‌ కొనాలంటే ఫలానా లింక్‌ ఓపెన్‌ చేయమంటే అదీ కూడా ఓపెన్‌ చేసాడు. అందులో ఈ గేమ్‌ యాప్‌ నిర్వాహకులు తెలివిగా తొలుత ఆ వెపన్స్‌ రూ.వంద నుంచి ధర చూపించాడు. ఓటీపీ అడిగినప్పుడు అదీ కూడా ఎంటర్‌ చేసేశాడు. ఆలా ఒక్కసారి చేస్తే మన బ్యాంక్‌ అకౌంట్ల విషయాలన్నీ వారికీ తెలిసే ఛాన్స్ ఉంది. రూ.వందతో మొదలైన వెపన్స్‌ కొనుగోలు రూ.400, రూ.1000 నుంచి రూ.5000 వరకు ధరలతో బాలుడి తన స్మార్ట్‌ ఫోన్‌ ఆపరేట్‌ చేయడంతో తన తల్లికి సంబంధించిన రెండు బ్యాంక్‌ల అకౌంట్ల నుంచి 20 రోజుల్లో మొత్తం రూ.5.40 లక్షలు మాయం అయ్యాయి.

తల్లి ఏదో అవసరం పడి శనివారం ఏటీఎంకు వెళ్లి రూ.15 వేలు డ్రా చేసేందుకు పిన్‌ కొడితే డబ్బులు రాలేదు. మళ్లీ రూ.10 వేలు డ్రా చేస్తే నగదు వచ్చింది. అయితే రూ.10 వేలు డ్రా అయిన తర్వాత తన స్మార్ట్‌ ఫోన్ ‌కు రూ.1000 మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్టు మెసేజ్ రావడంతో కంగారుపడింది. దీనితో వెంటనే బ్యాంకు కి వెళ్లి వివరాలు అరా తీసింది. అప్పుడు ఆమెకి అసలు విషయం తెలిసింది. దీనితో వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేసింది. యితే గేమ్‌ ఆడినప్పుడల్లా డబ్బులు డ్రా అయినట్టు స్మార్ట్‌ ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నా అవి గజిబిజిగా ఉండడంతో అంతగా చదువుకోని ఆమె పెద్దగా దృష్టి పెట్టలేకపోయింది. ఓటీపీ ఇవ్వడం, డ్రా అయిన డబ్బులకు మెసేజ్‌లు రావడంతో పోలీసులు ఈ కేసు సైబర్‌ నేరం కింద వస్తుందా? రాదా? అనే దానిపై సైబర్‌ నేరాల నిపుణలతో సంప్రదిస్తున్నారు. ఆమె భర్త కువైట్‌ లో ఉంటూ కష్ట పడి పనిచేస్తూ భార్య, పిల్లల కోసం రూ.లక్షలు కూడబెట్టి బ్యాంక్‌ లో వేస్తే కొడుకు సరదాగా ఆడిన ఓ ఆటవిబరి జీవితాలని మార్చేసింది.