ఆన్ లైన్ తరగతులు నిషేధం: ప‌్రైవేటు బడులపై ఏపీ ప్రభుత్వం సీరియస్

Sat Jul 04 2020 22:46:18 GMT+0530 (IST)

Online Classes: AP Regulation Serious on Private Schools

ప్రస్తుతం వైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. వాస్తవంగా ఈపాటికే ప్రారంభం కావాల్సిన విద్యా సంవత్సరం ఇప్పటివరకు తెరుచుకోవడం లేదు. విద్యా వ్యవస్థ గాడీ తప్పింది. వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ మూతపడగా.. పబ్లిక్ ప్రైవేటు వార్షిక.. ప్రవేశ పరీక్షలు తదితర వంటివి అన్ని వాయిదా పడ్డాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఎప్పుడు లాభాలు ఆర్జించే కార్పొరేటు ప్రైవేటు విద్యా సంస్థలు ఈ వైరస్ సమయాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు కొత్తగా ఆన్‌లైన్ తరగతులు అంటూ ప్రారంభించి వేల నుంచి లక్షల దాకా వసూలు చేస్తున్నవి ఎన్నో. ఈ విషయం తెలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.వాస్తవంగా మార్చి 23వ తేదీ నుంచి పాఠశాలలు విద్యాలయాలు మూతపడ్డాయి. అప్పటి నుంచి ఇంకా తెరుచుకోలేదు. అయితే విద్యాసంస్థల పునఃప్రారంభం జూలై 31వ తేదీ వరకు లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వీటన్నిటిని పట్టించుకోకుండా విద్యార్థులను అడ్డంగా పెట్టుకుని వైరస్‌ను పావుగా వాడుకుంటూ భారీగా ప్రత్యేక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆన్‌లైన్ తరగతుల పేరిట ఇంట్లో ఉండే పిల్లలకు పాఠాలు చెప్పే విధానం పాఠశాల యాజమాన్యాలు ప్రారంభించాయి. విపత్కాలాన్ని క్యాష్ చేసుకోవడానికి చేస్తున్న ఈ పనిని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యాశాఖ ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు చాలా వరకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తుండడంపై ఏపీ సర్కార్ మండిపడింది.

ప్రస్తుతం దేశంతో పాటు రాష్ట్రంలోనూ విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో వందలాది కేసులు రోజు చొప్పున నమోదవుతున్నాయి. వైరస్ ఉధృతి నేపథ్యంలో ఇంకా విద్యా సంవత్సరాన్ని ఖరారు చేయలేదని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. కొన్ని ప్రైవేటు స్కూల్స్ ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలిసిందని.. అయితే రాష్ట్రంలో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించడానికి వీల్లేదని మంత్రి స్పష్టం చేశారు. కొన్ని స్కూల్స్ ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రభుత్వం చెప్పేవరకు ఎలాంటి ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. నిబంధనలను అతిక్రమించి ప్రవర్తించే ప్రైవేటు విద్యా సంస్థలపై కఠిన చర్యలు తప్పవని మంత్రి సురేశ్ హెచ్చరించారు.