Begin typing your search above and press return to search.

కొనసాగుతున్న అమరావతి రైతులు మహాపాదయాత్ర.. స్పందన ఎంత భారీగా అంటే?

By:  Tupaki Desk   |   24 Nov 2021 10:57 AM GMT
కొనసాగుతున్న అమరావతి రైతులు మహాపాదయాత్ర.. స్పందన ఎంత భారీగా అంటే?
X
ఏపీ రాజధానిగా అమరావతిని మాత్రమే ప్రకటించాలని మూడు రాజధానులకు వ్యతిరేకంగా.. అమరావతి ప్రాంతంలో రాజధాని కోసం వేలాది ఎకరాల్ని ప్రభుత్వానికి ఇచ్చిన రైతులు మహా పాదయాత్ర పేరుతో చేస్తున్నయాత్ర కొనసాగుతోంది. ఏపీ అసెంబ్లీలోనూ.. హైకోర్టులోనూ మూడు రాజధానుల తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా ఏపీ సర్కారు ప్రకటించినప్పటికీ.. రైతులు తమ పాదయాత్రను ఆపేందుకు ఇష్టపడటం లేదు.

రెండు రోజుల క్రితం ఏపీ హైకోర్టుకు మూడురాజధానుల విషయంలో వెనక్కి తగ్గుతున్నామని.. దీనికి సంబంధించిన వివరాల్ని వెల్లడిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించటంతో పాదయాత్ర చేస్తున్న రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మిఠాయిలు పంచుకున్నారు. నెలల తరబడి తాము చేస్తున్న ఉద్యమానికి ఫలితం దక్కిందని భావించారు. అయితే.. కొన్ని గంటల అనంతరం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. మూడు రాజధానుల తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నామని.. త్వరలోనే మరింత పకడ్భందీగా బిల్లును తీసుకొస్తామని చెప్పారు.

అంతేతప్పించి మరోసారి పెట్టే బిల్లులో మూడు రాజధానులు ఉంటాయా? ఒక రాజధానికే పరిమితమవుతుందా? ఒకవేళ ఒక రాజధాని మాత్రమే అయితే.. అది అమరావతే అవుతుందా? విశాఖ అవతుందా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ముసురుకుంటున్నాయి. దీనికి తగ్గట్లే.. అప్పటివరకు మిఠాయిలు పంచుకున్న అమరావతి రైతులు సైతం దిగాలుగా మారి.. కన్నీరు పెట్టుకోవటం మహా పాదయాత్రలో స్పష్టంగా కనిపించింది.

ఏపీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవటం.. రేపొద్దున అసెంబ్లీలో ఎలాంటి బిల్లును ప్రకటిస్తారన్న సందేహంతో పాటు.. ప్రభుత్వ వైఖరి అస్పష్టంగా ఉన్న నేపథ్యంలో.. తాము షురూ చేసిన మహాపాదయాత్రను కంటిన్యూ చేస్తున్నారు. 24 రోజుల క్రితం తాడేపల్లిలో మొదలైన ఈ మహా పాదయాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో సాగుతోంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అన్న పేరుతో మొదలైన మహాపాదయాత్ర తిరుమలకు చేరుకోవటం ద్వారా ముగుస్తుంది.

ఇక.. పాదయాత్రలో పాల్గొంటున్న వందలాది మంది మహిళలు.. తమకు ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ వెరవకుండా పాదయాత్రను కంటిన్యూ చేస్తున్నారు. వాతావరణ ప్రతికూలతల్ని వారు భరిస్తున్నారు. తాజాగా పాదయాత్రలో పాల్గొన్న చాలామంది మహిళల కాళ్లకు బొబ్బలు ఎక్కి నడవటానికి తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. వారి కష్టాన్ని చూసిన నరసరావుపేట టీడీపీ ఇన్ ఛార్జి చదలవాడ అరవింద్ బాబు ఆవుపాలతో పాదయాత్రలో నడుస్తున్న మహిళల కాళ్లకు అభిషేకం చేశారు.

యాత్రకు రూ.3లక్షల విరాళాన్ని అందజేశారు. నెల్లూరు జిల్లా టీడీపీ నేత బీద రవిచంద్ర సైతం రూ.3లక్షల విరాళాన్ని అందజేశారు. రోజుకు సరాసరిన 15 కి.మీ. మేర పాదయాత్రసాగుతోంది. మొత్తం 45 రోజుల్లో సాగే ఈ పాదయాత్ర గుంటూరు.. ప్రకాశం.. నెల్లూరు.. చిత్తూరులోని 70ప్రధాన గ్రామాల గుండా సాగనుంది. మహాపాదయాత్రకు సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. పాదయాత్రసాగుతున్న గ్రామాల్లోని వారుస్వచ్ఛందంగా ముందుకు వచ్చి.. వారికి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే.. పాదయాత్రలో పాల్గొన్న వారంతా రైతులు కాదని.. టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణించారు. అయితే.. మహాపాదయాత్రలో పాల్గొన్న వారిలో చాలామంది తమ ఇష్టపూర్వకంగా రాజధాని కోసం భూములు ఇచ్చిన వారేనని.. వైసీపీ నేతలు కావాలనే తమ గురించి చెడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు.