Begin typing your search above and press return to search.

లాకప్ డెత్ కేసులో అరెస్ట్ అయిన పోలీస్ మృతి !

By:  Tupaki Desk   |   10 Aug 2020 5:30 PM GMT
లాకప్ డెత్ కేసులో అరెస్ట్ అయిన పోలీస్ మృతి !
X
తమిళనాడులోని తూత్తుకుడి కస్టోడియల్ తండ్రి, కొడుకుల లాకప్ డెత్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై తమిళనాడు అట్టుడికింది. దీనితో ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించి.. వారి సెల్ ఫోన్ దుకాణాన్ని తెరిచినందుకు పి. జయరాజ్, ఫెనిక్స్ లను అరెస్ట్ చేశారు తమిళనాడు పోలీసులు. అనంతరం వారు కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై కారణమైన ఇద్దరు ఎస్ఐలను, నలుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు.

తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మరణాలకు సంబంధించి అరెస్ట్ అయిన సబ్ ఇన్స్పెక్టర్ పాల్‌దురై నిన్న రాత్రి కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం కన్నుమూశారు. అయితే సరైన చికిత్స అందించక పోవడం వలనే పాల్‌దురై చనిపోయారని ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ లాకప్ డెత్ కేసు రాజకీయ ప్రకంపనలు కూడా సృష్టించిన సంగతి తెలిసిందే. విపక్ష డిఎంకె అయితే అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. రోడ్లపై డిఎంకె ఆధ్వర్యంలో నిరసనలు కూడా జరిగాయి.