Begin typing your search above and press return to search.

వైసీపీ కొంప ముంచేది వారే....?

By:  Tupaki Desk   |   7 Feb 2023 7:00 AM GMT
వైసీపీ కొంప ముంచేది వారే....?
X
అధికార వైసీపీలో లుకలుకలు ఒక్కొటొక్కటిగా బయటపడుతున్నాయి. ఎందుకంటే ఎన్నికలకు గడువు దగ్గరపడుతోంది. చేతిలో అధికారం కరిగిపోతోంది. అదే సమయంలో ఇక తమకు భవిష్యత్తు ఎక్కడ ఉంటుందో వెతుక్కునే వలస పక్షులు ప్రతీ ఎన్నికల సీజన్ లోనూ ఉంటాయి. వైసీపీ కూడా 2019 ఎన్నికల ముందు చాలా పక్షులకు తన చెట్టు నీడన ఆశ్రయం ఇచ్చింది. దానికి తగిన ఫలితం కూడా పొందింది.

ఇపుడు ఆ వలస పక్షులతో పాటు సహజ రాజకీయ జీవులు కూడా కొత్త రాగాలాపన చేస్తున్నాయి. ఎందుకంటే ఇది ఫక్తు రాజకీయం, ఇక్కడ పరస్పర ప్రయోజనాలే ఉంటాయి. వాటికే కూడించి భాగించి హెచ్చించి చివరికి వచ్చే రాజకీయ ఫలితాన్నే చూసుకుంటారు. అందులో లాభం ఉంటే ఉంటారు. లేకపోతే గూడు వదిలేస్తారు.

ఇక ఏపీ రాజకీయ చరిత్రలో ఎపుడు అతి పెద్ద కుదుపు నెల్లూరు జిల్లా నుంచే వస్తుంది అని అంటారు. అది ఒక ఆనవాయితీగా మారింది. అలాంటిదే ఈసారి కూడా జరిగింది. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్వరం పెంచి అసమ్మతి రాగాలు ఆలపించారు. దాంతో సర్దుకున్న హై కమాండ్ ఆనం ప్లేస్ లో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని తెచ్చి పెట్టింది. ఇది వెంకటగిరి కధ అయితే ఇపుడు నెల్లూరు రూరల్ నుంచి కూడా మరో అనూహ్యమైన రెబెల్ రెడీ అయ్యారు.

ఆయనే జగన్ భక్తుడిగా పేరు గడించిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆయన జగన్ పట్ల వైసీపీ పట్ల విధేయత అని చాటి చెబుతూనే హద్దులు దాటారు. తన రూట్ ఏంటో చెప్పేశారు. దాంతో ఆ ప్లేస్ లో కూడా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డిని వైసీపీ హై కమాండ్ ఫిక్స్ చేసి ముందుకు సాగుతోంది.

ఇక మరిన్ని అలకలు గొడవలు నేడో రేపో బయటపడతాయి. కానీ అదే వైసీపీలో ఉంటూ ఫుల్ సైలెంట్ గా ఉంటూ వస్తున్న వారే ఇపుడు చర్చకు వస్తున్నారు. వీరంతా ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ నుంచి చూసుకుంటే చాలా మంది కీలక నేతలు, కొందరు ప్రముఖ నాయకులు కూడా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. వారు ఎందుకిలా అన్నది అధినాయకత్వం ఏమైనా చెక్ చేసుకుంటోందా అన్నదే ఇపుడు పెద్ద డౌట్ గా ఉంది.

ఎందుకంటే వేయి మాటల కంటే ఒక్క మౌనం చాలా ప్రమాదకరం. అందులో అర్ధాలు వెతుక్కోవడం కూడా కష్టమే. ఇలా మౌనంగా ఉంటూ వచ్చిన వారే చివరికి కొంప ముంచుతారు ఇపుడు వైసీపీలో కూడా చాలా మంది మౌన మునులుగా ఉన్నారు. అంటే వీరు ఏమీ పార్టీకి విధేయులు అని లెక్క వేయాల్సిన అవసరం లేదు వీరు గోడ మీద ఉన్నారు అని అర్ధం చేసుకోవాలి. సమయం సందర్భం చూసి వీరు గోడ మీద నుంచి ఏ వైపునకు జంప్ చేస్తారో బహుశా వారికి కూడా తెలియదు.

అయితే వీరు తమ పార్టీలో ఉన్నారు కాబట్టి తమకే సొంతమని వైసీపీ పెద్దలు అనుకుంటే అది ఒక రకమైన భ్రమ లాంటి ధీమాగానే ఉంటుంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది నేతలు సైలెంట్ గా ఆపరేషన్ స్టార్ట్ చేశారు అని అంటున్నారు ప్రత్యర్ధి పార్టీలకు తమ గురించి సంకేతాలు ఇస్తూ టైం డేట్ ఫిక్స్ చేసుకునే పనిలో ఉన్నారని అంటున్నారు. ఇలాంటి వారికి పవర్ మాత్రమే కావాలి. అది ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు. వారికి విధేయత అన్నది పెద్ద ప్రశ్న కాదు, అది అసలు విషయమే కాదు.

అందువల్ల వీరంతా సైలెంట్ ఆపరెషన్ చేసుకుంటూ పోతూంటే అధినాయకత్వం ఏమి చేస్తుంది అన్నదే ఇక్కడ చర్చగా ఉంది. అంతా బాగుంది అని అనుకుంటే సుడిగుండాలు రాజకీయ గండాలు పొంచి ఉండే కాలం చాలా ముందర ఉంది అని అంటున్నారు. ఏపీలో ప్రస్తుతానికి అయితే రాజకీయ ముఖ చిత్రంలో స్పష్టత అయితే ఏ మాత్రం లేదు. కానీ ఆరు నెలల తరువాత తీసుకుంటే కచ్చితంగా అది వస్తుంది.

ఏ పార్టీకి ఊపు ఉంది. ఎవరికి జనంలో ఆదరణ ఉంది. గ్రాఫ్ పెరుగుతోంది అన్న లెక్కలు వస్తాయి. అపుడు ఈ సైలెంట్ ఆపరేషన్ చేసే వారు కానీ మౌన మునులు కానీ తమ యాక్షన్ ప్లాన్ ని అమలు లో పెడతారు అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉంది. పెద్ద పార్టీగా ఉంది. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి వారందరి గురించి ఆలోచించి పరిశీలించి తీరిక లేదు అనుకుంటే మాత్రం నష్టం వైసీపీకే అని అంటున్నారు.

పైకి కనిపిస్తున్న వారు రెబెల్స్ నిజంగా పార్టీకి మేలు చేశారనే అంటున్నారు. వారు తమ ఉద్దేశ్యాన్ని చెప్పేసుకున్నారు. వారిని ఎదుర్కోవడం కూడా ఎలాగో వైసీపీకి తెలుసు. కానీ సొంత పార్టీలోనే ఉంటూ పక్క పార్టీకి సైటు కొడుతున్న వారి సంగతినే తేల్చకపోతే వైసెపీ భారీ రాజకీయ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు. మరి ఇపుడు వైసీపీ అలెర్ట్ కావాల్సిన అవసరం ఉంది అంటే తప్పేమైనా ఉందా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.