పవర్ లేని వేళ ఇలా ఫైర్ అయితే ఎలా అఖిలమ్మ?

Wed Oct 09 2019 11:30:24 GMT+0530 (IST)

One More Case Booked against Bhuma Akhila Priya Husband Bhargav Ram

రాజకీయాల్లో ఉన్నప్పుడు ఓపిక అవసరం. కలిసి రాని కాలం నడుస్తున్నప్పుడు ఎంతటోడైనా కాస్త తగ్గి ఉండాల్సిన అవసరం ఉంది. అందునా.. పవర్ చేతిలో ఉన్నప్పుడు ఎంత చెలరేగిపోయినా.. ఎలానో సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ.. అధికారం చేజారిన వేళలో.. ఎంత తగ్గితే అంత మంచిది. ఈ విషయం ఎప్పటి నుంచో రాజకీయాలు చేసే పొలిటికల్ ఫ్యామిలీలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.అయితే.. ఈ విషయాన్ని ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ మిస్ అయినట్లున్నారు. తన భర్తకు ఎప్పుడెలా ఉండాలన్న విషయాన్ని సరిగా చెప్పినట్లు కనిపించట్లేదు. తొలి నుంచి పొలిటికల్ ఫ్యామిలీ అయిన భూమా ఇంటి అల్లుడిగా వచ్చిన ఆయన.. ఎక్కడ తగ్గాలో.. ఎంత తగ్గాలన్న విషయాన్ని పూర్తిగా వంటపట్టించుకున్నట్లుగా కనిపించట్లేదు.

భర్తకు తెలీని విషయాల్ని భార్య అయినా చెప్పాలిగా? అఖిల ఆ పని కూడా చేసినట్లు లేదు. ఇప్పుడున్న కేసులకు జతగా మరో కేసు నమోదు కావటం.. అది కూడా రాష్ట్రం కాని రాష్ట్రంలో అంటే తిప్పలే అన్న విషయాన్ని ఆమె గుర్తించటం లేదా? అన్నది క్వశ్చన్ గా మారింది. అఖిల భర్త భార్గవరామ్ పై కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు మరో కేసు హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేషన్ పరిధిలో నమోదు కావటం ఆసక్తికరంగా మారింది.

ఆళ్లగడ్డలో బుక్ అయిన రెండు కేసులకు సంబంధించిన విచారణలో భాగంగా భార్గవ్ రామ్ ను అరెస్ట్ చసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్ కు వచ్చారు. భార్గవ్ రామ్ స్వయంగా నడుపుకుంటూ వెళుతున్న ఫార్చునర్ కారును ఫాలో అయిన ఏపీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. తనను అరెస్ట్ చేయటానికి ఏపీ పోలీసులు వచ్చారన్న విషయాన్ని గుర్తించిన భార్గవ్ రామ్ తప్పించుకునే ప్రయత్నం చేసి.. మరో తప్పు చేశారు.

ఏపీ పోలీసుల్ని తప్పించుకునేందుకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ గుండా తన కారును మితిమీరిన వేగంతో నడుపుకుంటూ వెళ్లారు. ఒక హోటల్ దగ్గర భార్గవ్ రామ్ నడుపుతున్న కారును ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. కారును అపినట్లే ఆపి వేగంగా దూసుకెళ్లారు.

దీంతో.. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై హత్యాయత్నానికి పాల్పడిన కేసుతో పాటు.. కారుతో గుద్దే ప్రయత్నం చేశారన్న ఫిర్యాదును గచ్చిబౌలి పోలీసులకు ఆళ్లగడ్డ పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో.. అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిన్నటి వరకూ ఏపీ పోలీసులు మాత్రమే వెతుకుతుంటే.. తాజా ఘనకార్యంతో ఏపీ పోలీసులకు తెలంగాణ పోలీసులు జత కలిశారు. ఇలా తప్పు మీద తప్పు చేస్తూ.. కొత్త తిప్పల్ని తల మీదకు తెచ్చుకుంటున్న భార్గవ్ రామ్ కు అఖిలప్రియ హితోపదేశం చేయాల్సిన అసవరం ఎంతైనా ఉంది.