Begin typing your search above and press return to search.

ఒక్క కరోనా డోస్ ఇదుమందికి .. ఎలా అంటే ?

By:  Tupaki Desk   |   18 Jun 2021 12:30 AM GMT
ఒక్క కరోనా డోస్ ఇదుమందికి .. ఎలా అంటే ?
X
కరోనా చికిత్స, వ్యాక్సినేషన్ ప్రక్రియ లో ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు మారిపోతున్నాయి. గతంలో ప్లాస్మా చికిత్సతో అద్భుతాలు జరిగిపోతున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ఐసీఎంఆర్ ప్లాస్మా చికిత్సను రద్దు చేసింది. ఇక రెమిడిసివెర్ ఇంజక్షన్‌ కు గతంలో ఎంత ప్రాముఖ్యత ఉన్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత కరోనా చికిత్సలో దానికి కూడా అంత ప్రాధాన్యం లేదని స్పష్టం చేశారు. ఇక కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య నిడివి విషయంలో ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు మారిపోతున్న సంగతి తెలిసిందే. కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్ నెల రోజులని, 42 రోజులని ముందుగా చెప్పినప్పటికీ , ఆ తర్వాత చివరికి 84 రోజుల సుదీర్ఘ గ్యాప్ పెట్టారు. ఇప్పుడిక వ్యాక్సిన్ విషయంలో మరో కీలకమైన మార్పు సూచిస్తున్నారు నిపుణులు.

అదేమిటి అంటే .. ప్రస్తుతం దేశ ప్రజలకి వేస్తున్న కరోనా వ్యాక్సిన్ డోస్‌లో ఐదింట ఒక వంతు వేస్తే సరిపోతుందంటూ కొందరు నిపుణులు సూచిస్తున్నారు. కాకపోతే మామూలుగా వేసేలా కాకుండా భిన్నంగా వ్యాక్సినేషన్ చేయడం ద్వారా ఒక వ్యాక్సిన్ డోసును ఐదు మందికి వేయొచ్చని వారంటున్నారు. ఇంట్రాడెర్మల్‌ రూట్‌ ద్వారా అతి తక్కువ మోతాదులో కరోనా వ్యాక్సిన్‌ డోసు వేయొచ్చని, దీని వల్ల దేశంలో చాలా మందికి తక్కువ సమయంలో వ్యాక్సిన్లు అందుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఇంట్రామస్కులర్‌ రూట్‌ ద్వారా టీకా వేస్తున్నారు. దీనికి ఒక డోసులో 0.5 ఎంఎల్ చొప్పున కొవిడ్‌ టీకాను వాడుతున్నారు. ఐతే ఇంట్రాడెర్మల్‌ రూట్‌ లో వ్యాక్సినేషన్ చేస్తే 0.1 ఎంఎల్ డోసు సరిపోతుందట. అంటే ఇంట్రామస్కులర్‌ రూట్‌ ద్వారా ఒక్కరికి వేసే ఒక్క డోసును ఇంట్రాడెర్మల్‌ రూట్‌ ద్వారా ఐదుగురికి వేయొచ్చు. పైగా ఈ మార్గంలో తక్కువ డోసుతోనే అత్యంత సమర్థంగా వ్యాక్సిన్ పని చేస్తుందని కూడా అంటున్నారు.