ఏ మాత్రం తేడా వచ్చినా.. హైదరాబాద్ లో అంత భారీగా పేలుళ్లు

Tue Oct 04 2022 10:29:44 GMT+0530 (India Standard Time)

On the occasion of Dussehra terrorist attack in Hyderabad

హైదరాబాద్ లో ఉగ్రదాడికి సంబంధించి షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. దసరా పండుగ వేళ పాతబస్తీలో భాగంగా చెప్పే సైదాబాద్ లో నిర్వహించే రావణ దహనాన్ని టార్గెట్ గా పెట్టుకున్న సంచలన నిజం బయటకు వచ్చింది. అలా చేస్తే ప్రాణ నష్టం భారీగా ఉంటుందని ప్లాన్ చేశారు. జనసామ్యంలో ఉంటూ.. తన చుట్టూ ఉన్న వారిని బలి తీసుకునేలా ప్లాన్ చేసిన విషయాలు బయటకు వచ్చాయి.పాకిస్థాన్ లో ఉంటున్న హైదరాబాదీ ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ ఆదేశాలతో హైదరాబాద్ కు చెందిన జాహెద్ అతని టీం  విజయదశిమి వేళ భారీ విధ్వంసానికి కుట్ర పన్నినట్లు గుర్తించారు. సైదాబాద్ మొయిన్ రోడ్డులోని ఆంజనేయ స్వామి గుడిలో దసరా రోజున రామ్ లీలా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఆ సందర్భంగా పేలుళ్లకు కుట్రపన్నిన విషయాన్ని సిట్ వర్గాలు వెల్లడించాయి.

వారం క్రితం సైదాబాద్ లోని తొమ్మిది మందితో మీటింగ్ పెట్టుకున్న వారు.. ఆంజనేయ స్వామి గుడి వద్ద రెండుసార్లు రెక్కీ నిర్వహించారు. దాడి ఎలా చేయాలి? ఎక్కడి నుంచి తప్పించుకోవాలి? సీసీ కెమేరాలకు చిక్కకుండా ఏయే మార్గాల్లో వెళ్లాలి? లాంటి రూట్ మ్యాప్ లను రూపొందించుకోవటంతో పాటు.. తాము అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే భారీగా ప్రాణాలు తీయటమే లక్ష్యమన్న విషయాల్ని గుర్తించారు.

రామ్ లీలా కార్యక్రమానికి మూడు వేల మంది వరకు వస్తారని.. నాలుగు గ్రనేడ్లతో దాడి చేస్తే ప్రాణనష్టం భారీగా ఉంటుందన్నది వారి ప్లానింగ్ గా తేల్చారు. ఈ దాడుల అనంతరం భారీగా మత కల్లోలాలు రేపొచ్చని.. అలా జరిగితే.. తమ వ్యూహం సక్సెస్ అయినట్లేనని వారు భావించినట్లుగా చెబుతున్నారు. ఈ ఉగ్రదాడికి ప్రధానపాత్రధారి జాహెద్ రియల్ ఎస్టేట్.. వెల్డింగ్ వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తించారు. 2005లో బేగంపేట టాస్క్ ఫోర్సు ఆఫీసు మీద దాడి కేసుతో పాటు.. మానవ బాంబు దాడి కేసులోనూ అరెస్టు అయ్యారు. 12 ఏళ్లు జైలు జీవితం గడిపి 2017లో విడుదలయ్యాడు. పాక్ లోని ఫర్హతుల్లా ఘోరీతో కుట్ర చేసి.. భారీ విధ్వంసానికి తెర తీసినట్లుగా తెలుస్తోంది.

జాహెద్ తండ్రి ప్రభుత్వ టీచర్ గా పని చేశారు. అతని సోదరులు ఇద్దరికీ ఉగ్రవాద చరిత్ర ఉంది. పెద్ద అన్న మహమ్మద్ షాహిద్ బిలాల్ మోస్ట్ వాంటెడ్ గా చెబుతారు. దేశంలో ఎక్కడ ఉగ్ర విధ్వంసం జరిగినా అతని పేరు వినిపించేది. 2000  07 మధ్యలో జరిగిన వివిధ పేలుళ్లలో అతడి పేరు ఉంది.

అయితే.. 17 ఏళ్ల క్రితం పాక్ లోని కరాచీలో ఒక పెట్రోల్ బంక్ వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో షాహిద్ మరణించినట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే.. జాహెద్ భార్య వాదన మరోలా ఉంది. తన భర్తను పోలీసులు వేధిస్తున్నారని.. వారి నుంచి తమను రక్షించాలని ఆమె కోరుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.