Begin typing your search above and press return to search.

బాలిక‌పై 75 ఏళ్ల వ్య‌క్తి డిజిట‌ల్ రేప్‌.. ఇంత‌కీ డిజిట‌ల్ రేప్ అంటే..!

By:  Tupaki Desk   |   22 Sep 2022 10:40 AM GMT
బాలిక‌పై 75 ఏళ్ల వ్య‌క్తి డిజిట‌ల్ రేప్‌.. ఇంత‌కీ డిజిట‌ల్ రేప్ అంటే..!
X
3 ఏళ్ల బాలికను డిజిటల్ రేప్ (అత్యాచారం) చేసినందుకు పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాకు చెందిన అక్బర్ అలీ అనే వ్య‌క్తికి కోర్టు జీవిత ఖైదు విధించింది . ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సెక్టార్ 39 పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో ఆగస్టు 31న జరిగింది. కాగా డిజిటల్ రేప్ కేసులో జీవిత ఖైదు విధించడం ఇదే తొలిసార‌ని న్యాయ‌నిపుణులు చెబుతున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. అక్బర్ అలీ నోయిడాలో బాలిక పొరుగిల్లు అయిన‌ తన అల్లుడి ఇంట్లో ఉంటున్నాడు. రేప్ జ‌రిగిన ఆ రోజు ఉదయం 11 గంటలకు మూడేళ్ల బాలిక‌ తన ఇంటి బయట ఆడుకుంటోంది. నిందితుడు అక్బ‌ర్ అలీ బాలిక‌కు చాక్లెట్ ఇస్తాన‌ని పిలిచి తన గదికి తీసుకెళ్లాడు. ఆ త‌ర్వాత బాలిక‌పై రేప్‌కు పాల్ప‌డ్డాడు. చిన్నారి ఏడుస్తూ వ‌చ్చి త‌న త‌ల్లికి చెప్ప‌డంతో అక్బ‌ర్ అలీ చేసిన ఘాతుకం బ‌య‌ట‌ప‌డింది. దీంతో చిన్నారి తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

దీంతో బాలికకు డాక్టర్ పుష్పలత వైద్య ప‌రీక్ష‌లు చేశారు. అయితే ఆమె తన నివేదికలో బాలిక ప్రైవేట్ పార్ట్‌లో ఎటువంటి గాయాల‌ గుర్తులు లేవ‌ని పేర్కొన్నారు. బాలిక‌పై అత్యాచారం జ‌రిగిన‌ట్టుగా ఏ ఆధారాలు దొర‌క‌డం లేద‌ని చెప్పారు.

మ‌రోవైపు త‌న తాత అక్బర్ అలీ నిర్దోషి అని నాడు సాక్షిగా ఉన్న‌ ఆమె మనవరాలు కోర్టులో సాక్ష్యం ఇచ్చింది. ఇది తప్పుడు కేసు అని పేర్కొంది. ఘటనకు రెండు రోజుల ముందు తన కుటుంబం మాంసాన్ని వండి, ఎముకలను బ‌య‌ట‌ప‌డేశామ‌ని తెలిపింది. దీంతో బాలిక కుటుంబంతో త‌మ‌కు వాగ్వాదం చోటుచేసుకుందని ఆమె చెప్పింది. దీంతో వారు త‌న తాత‌పై త‌ప్పుడు కేసు న‌మోదు చేశార‌ని వెల్ల‌డించింది.

అయితే, బాధితురాలు, ఆమె తల్లిదండ్రుల సాక్ష్యాల ఆధారంగా కోర్టు తీర్పు ఇచ్చింది. పోక్సో చట్టం కింద అక్బర్ అలీకి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.50,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. జ‌రిమానా మొత్తంలో 80 శాతం బాలిక‌కు చెల్లించాల‌ని ఆదేశించింది. కాగా ఈ ఉత్తర్వును తాము హైకోర్టులో సవాలు చేస్తామ‌ని నిందితుడి మ‌న‌వ‌రాలు తెలిపింది.

మ‌రోవైపు డిజిట‌ల్ రేప్ కింద నిందితుడికి జీవిత ఖైదు విధించ‌డంతో డిజిట‌ల్ రేప్ అనే ప‌దం ఏమిట‌నేదానిపై సందేహాలు నెల‌కొన్నాయి. సాధార‌ణంగా మ‌నం డిజిట‌ల్ అన‌గానే కంప్యూటర్, సెల్‌ఫోన్‌, ట్యాబ్లెట్‌, ల్యాప్ టాప్‌, ఆన్‌లైన్ టెక్నాలజీకి సంబంధించిన ప‌దాలు అనుకుంటాం. కానీ, డిజిటల్ రేప్‌కు వీటితో ఏ సంబంధం లేద‌ని న్యాయ‌నిపుణులు చెబుతున్నారు.

డిజిట్ అనే ప‌దం నుంచి 'డిజిటల్ రేప్' అనే పదం పుట్టుకొచ్చింద‌ని అంటున్నారు. ఇంగ్లిష్‌లో డిజిట్ అంటే అంకె అని తెలిసిందే. అలాగే డిజిట్ అంటే సంఖ్య అని అర్థం మాత్ర‌మే కాకుండా చేతి వేలు, బొటన వేలు లేదా కాలి వేలు అనే అర్థాలు కూడా ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో డిజిటల్ రేప్.. అంటే చేతి వేళ్లు లేదా కాలి వేళ్లను బలవంతంగా మహిళల ప్రయివేటు భాగాల్లోకి చొప్పించ‌డం, లైంగిక హింసకు పాల్పడడం అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. నోయిడా ఘ‌ట‌న‌లో మూడేళ్ల బాలిక‌పై వృద్ధుడు చేసిన ప‌ని డిజిట‌ల్ రేప్ కింద‌కు వ‌స్తుంద‌ని భావించిన న్యాయ‌స్థానం అత‌డికి జీవిత ఖైదు విధించింది.

కాగా డిజిటల్ రేప్ అనే పదాన్ని 2013 నుంచి వాడటం ప్రారంభించార‌ని అంటున్నారు. అంత‌కుముందు వ‌ర‌కు అంటే 2012 వరకు భారతీయ శిక్షాస్మృతిలో డిజిట‌ల్ రేప్‌ను అత్యాచారం కింద పరిగణించలేద‌ని చెబుతున్నారు. దాన్ని లైంగిక వేధింపుల కింద మాత్రమే చూసేవార‌ని వివ‌రిస్తున్నారు. అయితే ఢిల్లీలో వైద్య విద్యార్థిని నిర్భ‌య‌పై అత్యాచారం తర్వాత కొత్త చ‌ట్టాల‌ను పార్లమెంటులో పెట్టి ఆమోదించార‌ని చెబుతున్నారు. 2013 ఫిబ్రవరి 3 నుంచి నిర్భ‌య చ‌ట్టం అమలులోకొచ్చింది. ఇందులోనే 'డిజిటల్ రేప్' అనే మాటను ఐపీసీలో పొందుప‌ర్చారు. దీని ప్ర‌కారం.. డిజిటల్ రేప్‌ను పోక్సో చట్టం కింద లైంగిక నేరంగా పరిగణిస్తారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.