Begin typing your search above and press return to search.

ఏపీలో మళ్లీ పాత కూటమి... ?

By:  Tupaki Desk   |   25 Nov 2021 12:33 PM GMT
ఏపీలో మళ్లీ పాత కూటమి... ?
X
భూమి గుండ్రంగా ఉంటుంది అంటారు కానీ జాగ్రత్తగా గమనిస్తే రాజకీయాలు కూడా గుండ్రంగానే తిరుగుతూ ఉంటాయి. అవి అలా వచ్చిన చోటుకే మళ్లీ వస్తూ పోతూ ఉంటాయి. ఏపీలో కూడా 2014 నాటి రాజకీయ బంధాలు గట్టిగా పెనవేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ని ఎదుర్కోవాలీ అంటే ఏ ఒక్క విపక్ష పార్టీకి సాధ్యపడదు, దాంతో అన్నీ కలసి మళ్ళీ ఉమ్మడిగా రానున్నాయి అంటున్నారు. దీనికి అపుడే బీజం పడిపోయింది కూడా. అమరావతి రైతుల మహా పాదయాత్ర సాక్షిగా ఇప్పటికే టీడీపీ బీజేపీ చెట్టాపట్టాలు వేసుకున్నారు. ఏపీకి అమిత్ షా వచ్చి కొత్తగా పాత రాజకీయ సమీకరణలకు తెర తీశారని టాక్. విపక్షంలోని పార్టీలకు ఎపుడూ అధికార పార్టీయే టార్గెట్ కావాలి. అలా జరిగితేనే రాజకీయం వికసిస్తుంది.

అమిత్ షా పార్టీ శ్రేణులకు సూచించింది కూడా అదే. వైసీపీని గట్టిగా ఎదుర్కోండి అని షా చేసిన సూచనలతో ఏపీ కమలదళం అజెండా టోటల్ గా మారిపోయింది. ఏపీకి బీజేపీ ప్రెసిడెంట్ గా సోము వీర్రాజు వచ్చాక జోరు తగ్గించిన ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇపుడు మళ్లీ హుషార్ చేస్తున్నారు. ఏపీ బీజేపీలో వారి పాత్ర, ప్రాధాన్యత బాగా పెరుగుతోంది. అదే సమయంలో తమ మాజీ పార్టీ టీడీపీతో దోస్తీని సానుకూలం చేసేందుకు వారు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతి రైతుల పాదయాత్రలో ఎలాంటి శషబిషలు లేకుండా టీడీపీ బీజేపీ నేతలు కలసిపోవడం, కరచాలనాలు, నవ్వుల పువ్వులతో సందడి చేయడం చూసిన వారికి ఈ పొత్తు ఖాయం అనే భావన కలిగింది.

ఇక మరో ఆసక్తికరమైన సన్నివేశం కూడా చోటు చేసుకోబోతోంది. జనసేన ఇప్పటిదాక అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొనలేదు. దాంతో ఆ ముచ్చట కూడా తీరనుంది. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నాదెండ్ల మనోహర్ జై అమరావతి అంటూ రైతులతో పాదం కదపబోతున్నారు. అంటే మూడు పార్టీలు అలా ఒక కామన్ ప్లాట్ ఫారం మీదకు వచ్చినట్లే లెక్క. ఇదే ఊపున ఏపీలో ఇతర ప్రజా సమస్యల మీద పోరాడేందుకు కూడా కసరత్తు సాగుతోంది. అంటే యంటీ జగన్ స్లోగన్ తో మూడు పార్టీలు కదం తొక్కుతాయన్న మాట.

పొత్తులు అన్నవి ఎన్నికలకు ముందు ప్రకటించే అవకాశం ఉన్నా ఇప్పటికైతే ఇచ్చిపుచ్చుకుంటూ కలసి మెలసి ఉండేలా తెర వెనక కసరత్తు అయితే సాగుతోంది. దాంతోనే టీడీపీలో కొత్త ధీమా కనిపిస్తోంది. వచ్చేది మా ప్రభుత్వమే అని చంద్రబాబు గట్టిగానే ప్రకటిస్తున్నారు. ఈ నేపధ్యంలో మూడు పార్టీలను ఎలా ఎదుర్కోవాలన్న దాని మీద వైసీపీ కూడా గట్టిగానే మధనం చేస్తోంది. 2014లో కలసి ఈ మూడు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. సేమ్ సీన్ రిపీట్ అవుతుంది అని వారిలో ఆశలు కలుగుతున్నాయి. అయితే నాడు జగన్ కూడా దాదాపుగా అధికారంలోకి వచ్చేశారని, కేవలం అయిదు లక్షల ఓట్ల తేడాతో ఓడారని వైసీపీ నేతలు లెక్కలు చెబుతున్నారు. నాటికీ నేటికీ తేడా ఉందని, అపుడు విపక్షంలో ఉంటూ పోరాడితేనే అంత గట్టి పోటీ ఇచ్చామని, ఇపుడు అధికారంలో ఉన్నామని, అందువల్ల మూడు కాదు పది పార్టీలు కలసినా వైసీపీని ఎదుర్కోవడం వారి వల్ల కాదని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి ఎవరి ధీమా ఎలా ఉనన ఏపీలో రాజకీయ స్పష్టత మాత్రం దాదాపుగా వచ్చేసినట్లే అంటున్నారు.