Begin typing your search above and press return to search.

ఐటీ ఉద్యోగులకు రానున్న 3 నెలలు ఆఫర్లే ఆఫర్లు

By:  Tupaki Desk   |   27 Oct 2021 6:06 AM GMT
ఐటీ ఉద్యోగులకు రానున్న 3 నెలలు ఆఫర్లే ఆఫర్లు
X
కరోనా.. తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యం లో పరిస్థితుల్లో చాలానే మార్పులు వచ్చాయి. కొన్నేళ్ల క్రితం ఐటీ ఉద్యోగుల్ని కంపెనీలు కొత్త అల్లుడ్ని చూసుకున్నట్లు చూసుకునేవి. తర్వాతి కాలం లో వాటిల్లో మార్పు వచ్చింది. కరోనా వేళ.. ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్న భయాందోళన నేపథ్యం లో ఇంటి నుంచి పని చేయించటం మొదలు పెట్టి.. పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా ఉద్యోగుల్ని కంపెనీలు తోమేశాయి. కరోనా కాలం లో ఇలాంటి తోముడు పై మాట్లాడితే ఏమవుతుందన్న సందేహంతో అన్ని మూసుకొని పని చేసిన ఉద్యోగులు.. గడిచిన ఆర్నెల్లలో బయట అవకాశాల కోసం చూసుకోవటం ఎక్కువైంది.

కరోనా నేపథ్యం లో డిజిటల్ సేవల తో పాటు.. ఆన్ లైన్ లావాదేవీల కు పెరిగిన నేపథ్యం లో ఐటీ సేవల అవసరాలు పెరిగాయి. దీంతో.. నిపుణుల అవసరం ఎక్కువైంది. దీంతో వలసలు మొదలయ్యాయి. రానున్న రోజుల్లో ఐటీకి ప్రాధాన్యత ఎక్కువ అవుతున్న నేపథ్యంలో.. అందుకు తగ్గట్లుగా కంపెనీలు విస్తరణ ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నాయి. దీనికి తోడు.. ఇప్పటికే చేస్తున్న కంపెనీలను విడిచి పెట్టిన ఉద్యోగులు వేర్వేరు అవకాశాల దిశ గా సాగిపోవటం ఎక్కువైంది. మొత్తం గా ఐటీ కంపెనీల్లో నియమకాల జోరు ఇటీవల కాలంలో ఎక్కువైంది.

టీసీఎస్.. ఇన్ఫోసిస్..విప్రో లాంటి కంపెనీలు అయితే.. ఈ ఏడాది నియమించాలని భావించిన ఉద్యోగుల లక్ష్యాన్ని మార్చుకోవటం చూస్తే.. పరిస్థితి ఎలా ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఈ ఏడాది తమ కంపెనీలు నియమించుకోవాల్సిన ఉద్యోగులకు సంబంధించి టీసీఎస్ 40వేలుగా అనుకుంటే.. మారిన పరిస్థితుల్లో దాన్ని కాస్తా 78వేలకు పెంచుకోవటం గమనార్హం. అదే బాటలో ఇన్ఫోసిస్ 26వేల నుంచి 45 వేలకు.. విప్రో 12వేల నుంచి 17వేలకు లక్ష్యాన్ని మార్చుకున్నాయి.

ఈ ఏడాది తొమ్మిది నెలల్లో ప్రముఖ ఐటీ కంపెనీలు 1.7 లక్షల మందిని నియమించుకున్నాయి. రానున్న రోజుల్లో తమ భవిష్యత్తు అవసరాల కోసం నియమించుకోవాల్సిన ఉద్యోగులు భారీ గా ఉండటం తో రానునన మూడు నెలలు ఐటీ ఉద్యోగుల కు బోలెడన్ని అవకాశాన్ని రానున్నట్లు చెబుతున్నారు. కరోనా మూడో వేవ్ మాటలు మళ్లీ మొదలవుతున్న వేళలో.. నియమకాలకు సంబంధించిన వస్తున్న వార్తలు ఐటీ ఉద్యోగుల్లో హుషారు ను పెంచేలా చేస్తున్నాయని చెప్పక తప్పదు.