వజ్రోత్సవ వేళ.. ఎర్రకోట నుంచి దేశ ప్రజలకు మోడీ ఇచ్చిన సందేశం ఇదే

Mon Aug 15 2022 12:10:15 GMT+0530 (IST)

Occasion of Vajrotsava Modi gave message To People From RedFort

యావత్ భారతావని రోజు రానే వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అయ్యింది. గడిచిన కొద్ది రోజులుగా తీవ్రమైన భావోద్వేగంతో రగులుతున్న భారతదేశం.. ఇప్పటికే ప్రతి ఇంటి ముందు త్రివర్ణ పతాకంతో కొత్త కళను సంతరించుకుంది.త్రివర్ణ పతాకాన్ని ఇంటికి.. వాహనానికి ఇలా అవకాశం ఉన్న ప్రతి చోట ఉంచుతున్న వైనం ఈసారి పంద్రాగస్టు ప్రత్యేకతగా చెప్పాలి. ఈ రోజు (సోమవారం ఆగస్టు 15) ఉదయం ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాల్ని చూస్తే..
- దేశ ప్రజలందరికి స్వాతంత్య్ర వజ్రోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ వ్యాప్తంగా భారత స్వాతంత్య్ర దినోత్సవం జరుగుతోంది. ఈ అమ్రత మహోత్సవ వేళ భారతీయులందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. త్యాగధనుల పోరాట ఫలితమే మన స్వాతంత్య్రం. మహనీయులు మనకు స్వాతంత్య్రాన్ని అందించారు. బానిస సంకెళ్ల ఛేదనలో వారి పోరాటం అనుపమానం.
-  గాంధీ.. సుభాష్ చంద్రబోస్.. అంబేడ్కర్ లాంటి వారు మార్గదర్శకులు. ఎంతోమంది సమరయోధులు తమ ప్రాణాల్ని త్రణప్రాయంగా వదిలేశారు. మహానీయుల తిరుగుబాట్లు మనకు స్ఫూర్తి. అమ్రత మహోత్సవాల వేళ కొత్త దశ.. దిశను ఏర్పాటు చేసుకోవాలి.

- త్యాగధనుల బలిదానాలను స్మరించుకునే అద్రష్టం కలిగింది. దేశ నలుమూలలా ఎంతోమంది వీరులను స్మరించుకునే రోజు ఇది. జీవితాలనే త్యాగం చేసిన వారి ప్రేరణతో నవ్యదిశలో పయనించాలి. మన ముందున్న మార్గం కఠినమైనది.  ప్రతి లక్ష్యాన్ని సకాలంలో సాధించాల్సిన బాధ్యత మనపై ఉంది.
- ఈ 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం. వందల ఏళ్ల బానిసత్వంలో భారతీయతకు భంగం కలిగింది. బానిసత్వంలో భారతీయత భావన గాయపడింది. ఎన్నో అనుమానాల్ని పటాపంచలు చేస్తూ భారత్ నిలిచి గెలిచింది. ప్రపంచం మీద దేశ తనదైన ముద్ర వేసింది. అభివ్రద్ధి చెందిన ప్రపంచ దేశాల సరసన భారత్ ను నిలబెదాం.
-  ఎలాంటి సమస్యలు వచ్చినా ఓటమిని అంగీకరించకుండా పోరాటం చేస్తూ ముందుకు సాగుతున్నాం. .రాణి లక్ష్మీబాయి ఝల్కారీ బాయి చెన్నమ్మ బెగన్ హజ్రత్ మహా వంటి భారత మహిళల బలాన్ని గుర్తు చేసుకుంటే భారతదేశం గర్వంతో నిండిపోతుంది.

-  మంగళ్ పాండే తాంతియా తోపే భగత్ సింగ్ సుఖ్‌దేవ్ రాజ్‌గురు చంద్రశేఖర్ ఆజాద్ అష్ఫాఖుల్లా ఖాన్ రామ్ ప్రసాద్ బిస్మిల్ మరియు బ్రిటిష్ పాలనకు చరమ గీతం పాడిన మన అసంఖ్యాక విప్లవకారులకు ఈ దేశం కృతజ్ఞతలు.
-  భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ బలం. భారత దేశం ప్రజాస్వామ్యానికి తల్లి. స్వాతంత్య్రానంతరం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ భారత పౌరుల ఉత్సాహాన్ని ఏదీ అడ్డుకోలేదు. ఈ మట్టికి ఆ శక్తి ఉంది. కష్టాలకు తలవంచక.. లేదు ముందుకు సాగుతూనే ఉంది.

-  యువశక్తిలో దాగి ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీయాలి. ఎంతో మంది యువత స్టార్టప్ లతో ముందుకు వస్తున్నారు. మన మూలాలు బలంగా ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగగలం. పర్యావరణ పరిరక్షణ కూడా డెవలప్ మెంట్ లో భాగమే. నిలబడదనుకున్న భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శనం.
-  ప్రజాస్వామ్య దేశాలకు భారత్ మార్గదర్శిగా నిలిచింది. మహాత్ముని ఆశయాలకు.. భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తున్నాం. దేశ ప్రగతిని పరుగులు పెట్టించేందుకు ప్రతి పౌరుడు సిద్దంగా ఉన్నాడు.

-  కేంద్ర రాష్ట్రాలు ప్రజల ఆశల సాకారమే లక్ష్యంగా పని చేయాలి. ప్రతిక్షణం పని చేయాల్సిన సమయం ఆసన్నమైనంది. భారత ప్రజానీకం నవచేతనతో ముందడుగు వేస్తోంది. ప్రపంచ దేశాల సరసన నిలబడేందుకు సమిష్టి క్రషి చేయాలి. భారత్ ఇవాళ సగర్వంగా తలెత్తుకొని నిలబడింది. ప్రపంచమంతా మనవైపు చూస్తోంది.
-  వచ్చే 25 ఏళ్లు అమ్రతకాలం. మనకు అత్యంత ప్రధానమైనది. సంపూర్ణ అభివ్రద్ధి మన ముందున్న అతి పెద్ద సవాల్. మనలో దాగి ఉన్న బానిస మనస్తత్వాన్ని తుదముట్టించాలి. సర్వస్వతంత్ర ప్రజాస్వామ్యంగా మనం నిలబడాలి.