Begin typing your search above and press return to search.

సీబీఐ చొచ్చుకెళ్లొచ్చు.. ఎంట్రీపై నిషేధం చెల్లదిక

By:  Tupaki Desk   |   3 Dec 2021 11:30 AM GMT
సీబీఐ చొచ్చుకెళ్లొచ్చు.. ఎంట్రీపై నిషేధం చెల్లదిక
X
రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ ప్రయోగం.. నయానో భయానో లొంగదీసుకునే యత్నం.. ఎన్నికల ముంగిట ఇలాంటి మరీ ఎక్కువగా ఉంటాయి. ఎంతైనా ఎన్నికల్లో గెలుపే ప్రామాణికం కాబట్టి, ఎవరి ఎత్తులు వారివి. రాష్ట్రాల్లో బలమైన నాయకులుండి.. కేంద్రంలో మరింత బలమైన నాయకులుంటే.. ఇలాంటి ఎత్తులు పైఎత్తులు మరింత రంజుగా సాగుతాయి.

2019 లోక్ సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రయత్నాలే సాగాయి. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎంగా ఉంటూ.. తమ రాష్ట్రంలో సీబీఐ రాక మీద నిషేధం విధించారు. కేంద్ర ప్రభుత్వం తమపై కక్ష పూరితంగా వ్యవహరిస్తూ సీబీఐని ఉసిగొల్పుతోందని ఆయన ఆరోపించారు. అసలు ఆయన నిర్ణయానికి స్ఫూర్తి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్ణయమే.

ధర్మ పోరాటమంటూ..

2018 కేంద్ర బడ్జెట్ తర్వాత ఏపీ కి ప్రాధాన్యం లభించకపోవడం, ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీగా మారిపోవడంతో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో విభేదించారు. ధర్మ పోరాటమంటూ.. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశారు. ప్రధాని మోదీపై ధ్వజమెత్తారు. ఆయన కంటే తానే సీనియర నంటూ ప్రకటనలు చేశారు.

అయితే, అదే సమయంలో ఏపీలో తన పాలనలో చోటుచేసుకున్న అవినీతిపై కేంద్రం సీబీఐతో విచారణ చేయిస్తుందన్న భయంతో రాష్ట్రంలోకి దాని ప్రవేశాన్ని నిషేధించారు. సీబీఐ ప్రత్యేకంగా నిషేధాజ్లలు లేని ప్రాంతాల్లో మాత్రమే వెళ్లేందుకు అనుమతి కల్పిస్తున్న ఢిల్లీ స్పెషల్ పోలీసు యాక్ట్ కారణంగా అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోగలిగింది.

ఎన్డీఏ, కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేశాక.. చంద్రబాబును టార్గెట్ చేసేందుకు సీబీఐని ఉసిగొల్పేందుకు కేంద్రం సిద్ధమైంది. విషయం పసిగట్టిన చంద్రబాబు.. ఏపీలోకి సీబీఐకి రాకుండా నిషేధం విధించారు. ఇది కేంద్రానికి మంట పుట్టించింది.

తాము కోరుకున్న విధంగా ఏపీకి సీబీఐ అధికారుల్ని పంపి చంద్రబాబును లొంగదీసుకునేందుకు చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో కేంద్రం అహం దెబ్బతింది. అప్పటి నుంచి సీబీఐ విషయంలో కేంద్రం పునరాలోచన చేస్తోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని సవరిస్తోంది.

మళ్లీ కోరలు..

ఢిల్లీ ప్రత్యేక పోలీసు చట్టం ఢిల్లీ స్పెషల్ పోలీసు చట్టం ప్రకారం ఏర్పాటైన సంస్ధ సీబీఐ. కేంద్ర నేర పరిశోధనా సంస్ధగా ఉన్నప్పటికీ దీన్ని ఢిల్లీ పోలీసు యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేయడంతో పరిమిత అధికారాలు మాత్రమే దక్కాయి. దీంతో ఢిల్లీలో పూర్తిస్ధాయిలో ప్రవేశానికి అనుమతులున్నాయి.

కానీ, మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆంక్షలతో మాత్రమే అధికారాలు ఉన్నాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర పాలిత ప్రాంతమైనా ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి సీబీఐని తమ ప్రాంతంలోకి రాకుండా ఆంక్షలు విధించవచ్చు.

దీన్ని ధిక్కరించే అధికారం సీబీఐకి లేదు. కేంద్రం, రాష్ట్రాల మధ్య పోరు సాగుతున్న ఈ రోజుల్లో సీబీఐని రాష్ట్ర ప్రభుత్వాలపైకి, తమ ప్రత్యర్ధులపైకి ఉసిగొల్పుతున్న కేంద్రానికి ఇది ఇబ్బందిగా మారింది.

ఢిల్లీ పోలీసు చట్టానికి సవరణ

సీబీఐ రాకను నిషేధిస్తూ గతంలో చంద్రబాబు, మమతా తీసుకున్న నిర్ణయం తరహాలో భవిష్యత్తులో మరే రాష్ట్రాల నుంచి ప్రతిఘటన రాకుండా.. ఎన్డీయే సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఢిల్లీ పోలీసు యాక్ట్ ను సవరించాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా శుక్రవారం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టింది. ఆమోదానికి ప్రయత్నాలు చేస్తోంది పార్లమెంట్ ఉభయ సభల్లోనూ దీనిపై చర్చ జరగాల్సి ఉంది. దీన్ని ఆమోదిస్తే ఇక సీబీఐకి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.

ప్రత్యర్థులు ఆపలేరిక..

సీబీఐ రాష్ట్రాలకు స్వేచ్చగా వెళ్లకుండా అడ్డంకిగా ఉన్న ఢిల్లీ ప్రత్యేక పోలీసు చట్టంలోని ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం సవరణ బిల్లు తీసుకొచ్చింది. ఇది పార్లమెంటు ఆమోదం పొందితే ఇక సీబీఐ ఏ రాష్ట్రంలోకి అయినా, కేంద్ర పాలిత ప్రాంతంలోకి అయినా ఎవరి అనమతి లేకుండానే అడుగు పెట్టేందుకు వీలవుతుంది.

ఇప్పటికే ఎన్ఐఏతో పాటు ఇతర కేంద్ర దర్యాప్తు సంస్ధలు దేశవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్లి తనీఖీ చేసే వీలుంది. ఎవరినైనా అదుపులోకి తీసుకునే వీలుంది.

ఇప్పుడు పార్లమెంటులో ఢిల్లీ పోలీసు చట్టానికి సవరణలు కూడా ఆమోదం పొందితే సీబీఐకి కూడా అదే తరహా అధికారాలు దక్కనున్నాయి. దీంతో ఇక ఎన్డీయే సల్కార్ కు ప్రత్యర్ధులుగా ఉన్నవారు, ప్రత్యర్ధులుగా మారాలనుకుంటున్న వారికి కూడా భవిష్యత్తులో చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.

అంతా బానే ఉంది కానీ..

ఇప్పుడంటే అధికారంలో ఉన్న ఎన్డీఏకి తాజా నిర్ణయం మేలు చేయొచ్చు. మరి ఎన్నికల్లో ఓడిపోయి కేంద్రంలో ప్రభుత్వం మారితే.. సీబీఐని అడ్డు పెట్టుకుని రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలను ఇరుకున పెట్టేందుకు కూలదోసేందుకు కేంద్రంలోని ప్రభుత్వం ప్రయత్నిస్తే? అప్పుడేం జరుగుతుందో చూడాలి.