రాహుల్ కు షాకిచ్చిన తెలంగాణ ప్రభుత్వం

Fri Aug 10 2018 16:46:10 GMT+0530 (IST)

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు టీఆర్ ఎస్ ప్రభుత్వం ఆదిలోనే మోకాలడ్డింది. తాజాగా ఆయన ఈనెల 13 - 14 తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఓయూలో సభను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ సర్వం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ సభ కు  అనుమతిని నిరాకరిస్తూ ఓయూ వీసీ ఉత్తర్వులు జారీ చేశారు.  భద్రతా కారణాల వల్ల ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో సదస్సుకు అనుమతి నిరాకరిస్తున్నట్టు ఓయూ వీసీ శుక్రవారం తెలిపారు.  దీంతో పలువురు ఓయూ విద్యార్థులు దీనికి నిరసనగా హైకోర్టుకు వెళ్లారు.తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువు అయిన ఉస్మానియా యూనివర్సిటీలో  రాహుల్ ప్రసంగిస్తే మంచి మైలేజ్ వస్తుందని కాంగ్రెస్ భావించింది. అయితే రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా టీఆర్ ఎస్ - కాంగ్రెస్ లకు సపోర్టుగా విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అంటూ ఓ వర్గం విద్యార్థులు ఆందోళన చేస్తుండగా.. టీఆర్ ఎస్ దే ఆ ఖ్యాతి మరో వర్గం వారి మధ్య గొడవలు మొదలైనట్టు తెలిసింది. దీంతో ఈ అల్లకల్లోల వాతావరణంలో రాహుల్ గాంధీ వస్తే మరింత గొడవలు ముదిరే చాన్స్ ఉందని వీసీ - తెలంగాణ ప్రభుత్వం రాహుల్ సభకు అనుమతి నిరాకరించినట్టు తెలిసింది. ఇక యూనివర్సిటీలో రాజకీయ నేతల ప్రసంగాలు అనుమతించబడవని తాజాగా ఓయూ వీసి స్పష్టం చేశారు.