పాపం మాజీ సీఎం.. పరిస్థితి ఘోరం

Thu Apr 25 2019 16:23:12 GMT+0530 (IST)

O Puppet Collector, I Will Come Back to Power Again Says Shivraj Warns MP Official

ఉద్యోగం లేని మగాడిని పదవి లేని నాయకుడిని ఈ సమాజం  ఎలాంటి దృష్టితో చూస్తుందో మనం వేరేలా చెప్పక్కర్లేదు. ఇక చండసాసనులు పాలిస్తున్న చోట కూడా అధికారులు మన మాట వినరు.. ఇప్పుడూ అలానే జరిగింది.దాదాపు మూడు దఫాలు మధ్యప్రదేశ్ ను సీఎంగా ఏలిన శివరాజ్ సింగ్ చౌహాన్ మొన్న డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. ఇప్పుడు మాజీ సీఎం అయ్యాడు. ఆప్రతిహత రాజకీయ యాత్రకు బ్రేక్ పడింది. అధికారం కోల్పోవడంతో పాపం ఈయన్ను అధికారులు కూరలో కరివేపాకులా తీసేస్తున్నారు. కనీసం పట్టించుకోవడం లేదు. ఆ బాధలో ఏం మాట్లాడాలో అర్థం కాక శివరాజ్ సింగ్ చౌహాన్ తాజాగా నోరుజారాడు.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో ప్రచారానికి శివరాజ్ సింగ్ హెలిక్యాప్టర్ కు సాయంత్రం 5గంటల వరకూ అనుమతి తీసుకున్నాడు. కానీ శివరాజ్ 5.30గంటలకు వచ్చాడు. దీంతో ఆయన హెలీక్యాప్టర్ దిగేందుకు స్థానిక కలెక్టర్ అనుమతి ఇవ్వలేదు. దీనిపై ఆగ్రహించిన మాజీ సీఎం శివరాజ్ కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తిరిగి అధికారంలోకి వచ్చాక నీ పరిస్థితి ఏమవుతుందో చూస్తానంటూ బెదిరించాడు. బెంగాల్ లో మమతలాగానే మధ్యప్రదేశ్ లో సీఎం కమల్ నాథ్ ప్రత్యర్థుల హెలిక్యాప్టర్లకు అనుమతి ఇవ్వడంలేదని మండిపడ్డారు.

ఇలా మూడు సార్లు సీఎంగా చేసిన పెద్దమనిషికే అధికారం కోల్పోయాక కానీ పరిస్థితి అర్థం కావడం లేదు. అధికారానికి ప్రతిపక్షానికి ఎంత తేడా ఉంటుందో.. అయినా అధికారంలో ఉన్న వాళ్లకు అధికారులు ఇంతలా స్వామి భక్తి చూపించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.